తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘జగమే తంత్రం’. పిజ్జా, జిగర్ తండ, పేట లాంటి సినిమాలతో పాపులర్ అయిన యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఏడాది కిందటే ఈ చిత్రం విడుదలకు సిద్ధమైనప్పటికీ.. కరోనా కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు. చివరికి హీరో ధనుష్‌కు ఇష్టం లేకపోయినప్పటికీ.. నిర్మాత శశికాంత్ థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నెట్ ఫ్లిక్స్‌లో నేరుగా ‘జగమే తంత్రం’ను విడుదల చేయడానికి సిద్ధమైపోయాడు.
ఈ నెల 18న ప్రిమియర్స్ పడబోతున్నాయి. తాజాగా దీని ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. ఒక ఇంటర్నేషనల్ మాఫియా డాన్.. అతణ్ని ఎదిరించి తన కంట్లో నలుసులా మారే ఒక సామాన్యుడు.. ఈ సెటప్‌లో హాలీవుడ్ స్టయిల్లో ఒక సూపర్ స్టైలిష్ థ్రిల్లర్ తీసినట్లున్నాడు కార్తీక్ సుబ్బరాజ్. ఈ ట్రైలర్ అనే కాదు.. ఇంతకుముందు రిలీజ్ చేసిన ప్రోమోలు కూడా చాలా స్టైలిష్‌గా కనిపించాయి.
ఐతే ఒకేసారి తెలుగులో కూడా విడుదల కాబోతున్న ‘జగమే తంత్రం’కు రజినీకాంత్ సినిమా ‘కబాలి’తో పోలిక కనిపిస్తుండటమే కొంచెం ఆందోళన కలిగిస్తున్న విషయం. ‘కబాలి’ సైతం పూర్తిగా విదేశంలో నడిచే సినిమా. హీరో అందులో ఒక సామాన్యుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెడతాడు. తమను తక్కువగా చూసే వాళ్ల మీద ఎదురు తిరగతాడు. పెద్ద స్థాయికి ఎదుగుతాడు. హీరోను మట్టుపెట్టాలని అక్కడి బడా మాఫియా డాన్ చూస్తుంటాడు.
ఈ క్రమంలో వారి మధ్య సాగే పోరు నేపథ్యంలో సినిమా నడుస్తుంది. రజినీ అల్లుడు నటించిన ‘జగమే తంత్రం’ కథ కూడా దాదాపు ఇలాగే అనిపిస్తోంది. ఇక్కడా ఫారిన్ బ్యాక్ డ్రాప్.. పెద్ద మాఫియా డాన్.. అతడిపై ఎదురు తిరిగి పెద్ద స్థాయికి ఎదిగే హీరో.. ఇలా సెటప్ అంతే సేమ్ లాగే ఉంది. ‘జగమే తంత్రం’ కొంచెం కొత్తగా, స్టైలిష్‌గా అనిపిస్తున్నప్పటికీ ఎంటర్టైనింగ్‌గా ఉంటుందా అన్న డౌట్లు కొడుతున్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిస్తుందో చూడాలి