ప్రస్తుతం ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ అంటే ప్రభాసే. కేవలం అతణ్ని నమ్ముకుని వందల కోట్లు బడ్జెట్లు పెడుతున్నారు. అంతకు మించి బిజినెస్ కూడా జరుతుతోంది ఆ చిత్రాలకు. రాధేశ్యామ్ తర్వాత ప్రభాస్ లైన్లో పెట్టిన మూడు సినిమాల బడ్జెట్ కలిపితే వెయ్యి కోట్లకు పైమాటే అంటే అతడి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించనున్న చిత్రం ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కనున్న చిత్రం కానున్నట్లుగా సంకేతాలు అందుతున్నాయి. ముందు ఈ సినిమా బడ్జెట్ రూ.300 కోట్లన్నారు కానీ.. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఖర్చు రూ.500 కోట్ల దాకా ఉండబోతోందని తెలుస్తోంది.
కాగా ఈ 500 కోట్లలో 40 శాతం బడ్జెట్ కేవలం పారితోషకాలకే పోనుందట. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించనుండగా.. బిగ్-బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. వీళ్ల పారితోషకాలు భారీగానే ఉంటాయి. ఇక ప్రభాస్ రేంజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ అత్యధిక సమయం వెచ్చించనున్నది ఈ చిత్రానికే అంటున్నారు. పారితోషకం రికార్డు స్థాయిలోనే ఉండబోతోందట. ఈ సినిమాలో బాలీవుడ్ నుంచే దాదాపు పది మంది ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తారంటున్నారు.
ఇక మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరికీ కలుపుకుంటే పారితోషకాలకు రూ.200 కోట్లు కావడం ఆశ్చర్యమేమీ కాదు. మేకింగ్, అలాగే పబ్లిసిటీకి కలిపి రూ.300 కోట్ల దాకా ఖర్చు పెట్టనున్నారట. ఈ ఏడాదే సినిమాను పట్టాలెక్కించాలనుకున్నారు కానీ కుదర్లేదు. వచ్చే ఏడాది షూటింగ్ మొదలుపెట్టి 2023 ద్వితీయార్ధంలో రిలీజ్ చేసే అవకాశముంది.