పాన్ ఇండియా అనగానే ఇదేదో సినిమా కబురు అనుకుంటున్నారేమో. కాదు కాదు. ఏడాది కిందట కరోనా కారణంగా లాక్ డౌన్ తలెత్తినప్పటి నుంచి అనితర సాధ్యమైన రీతిలో సేవా కార్యక్రమాలు చేపడుతూ పాన్ ఇండియా లెవెల్లో రియల్ హీరోగా అవతరించిన సోనూ సూద్.. ఇప్పుడు తన ఛారిటీని మరో స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాడు.
కరోనా సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ అందక దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. దీంతో ఇటు ప్రభుత్వం, అటు స్వచ్ఛంద సంస్థలు.. ఇకపై ఆక్సిజన్ అందక ప్రాణాలు పోకూడదన్న సంకల్పంతో ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. గత రెండు నెలల్లో వేలాది మందికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, సిలిండర్లు అందజేసి ప్రాణాలు నిలబెట్టిన సోనూ.. ఇప్పుడు ఈ విషయంలో మరో గొప్ప ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక పై ఆక్సిజన్ కాన్సంట్రేటర్ కావాలంటే సోనూ టీంకు ఫోన్ చేసి దాని కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. ఈ మార్గంలో అందరికీ సాయం చేయడం సాధ్యం కాదని భావించి.. సోనూ టీం ప్రణాళికాబద్ధమైన అడుగు వేసింది.
www.umeedsonusood.com పేరుతో ఒక వెబ్ సైట్ ఓపెన్ చేసి. అత్యవసర స్థితిలో ఉన్నవాళ్లు అందులో తమ వివరాలు సమర్పించి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అడిగితే చాలు.. ఉచితంగా వారి అడ్రస్‌కు దాన్ని పంపించేస్తారు. ఇందుకోసం తుష్టి ఫౌండేషన్ అనే సంస్థతో సోనూ చేతులు కలిపాడు. డీటీడీసీ కొరియర్ సర్వీస్ వాళ్లు కూడా ఇందులో భాగస్వాములు అయ్యారు. ఈ రెండు సంస్థల భాగస్వామ్యంతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు కొని, ఉచితంగా బాధితులకు డెలివరీ ఇవ్వబోతోంది సోనూ ఫౌండేషన్.
వెబ్ సైట్లోకి వెళ్లి రిజిస్టర్ చేయించుకుని ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందుకోవడం అంటే ఇంతకంటే బాధితులకు ఉపశమనం ఏముంటుంది? దీనికి ‘ఉచిత పాన్ ఇండియా’ ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ సరఫరా’ అని నామకరణం చేశాడు సోనూ. దేశవ్యాప్తంగా ఇలా వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్లందరికీ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించాలంటే భారీగా ఖర్చయ్యే అవకాశముంది. డిమాండుకు తగ్గట్లు సరఫరా చేయడం అంత తేలిక కాదు. అయినా ధైర్యంగా సోనూ ఈ ప్రకటన చేశాడంటే ఎంత భారీ స్థాయిలో ఈ ప్రాజెక్టును చేపట్టాడో అర్థం చేసుకోవచ్చు. దీంతో అతడి ఛారిటీ మరో స్థాయికి చేరుతుందనడంలో సందేహం లేదు.