ఆనందయ్య మందును నమ్ముతా-బాలయ్య

కరోనా నివారణ, చికిత్స కోసం ఆయుర్వేద మందు తయారు చేసి రోగులకు ఉచితంగా అందజేస్తున్న నెల్లూరు కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య గురించి గత రెండు మూడు వారాలుగా ఎంత చర్చ నడుస్తోందో తెలిసిందే. ఆయన మందు అద్భుతంగా పని చేస్తోందంటూ ఎంతో మంది వీడియోలు పెడుతున్నారు. కొందరు రాజకీయ నేతలు ఆయనకు మద్దతుగా ప్రకటనలు ఇస్తున్నారు.

అదే సమయంలో శాస్త్రీయత లేకుండా, ఎలాంటి పరీక్షలు లేకుండా, నిపుణులు నిర్ధారించకుండా ఇలా ఇష్టానుసారం మందులిచ్చేయడం ఏంటి అనే ప్రశ్నలు సంధిస్తున్నారు మిగతా వాళ్లు. ప్రస్తుతం ఆనందయ్య మందుపై పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఆనందయ్యకు నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మద్దతు పలకడం విశేషం. ఆయన మందుపై తనకు నమ్మకం ఉందంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు.

శుక్రవారం ఎన్టీఆర్ జయంతి అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించిన ఆయన.. ఆనందయ్య మందు గురించి మీడియా వాళ్లు అడిగితే సమాధానం చెప్పాడు. తనకు ఆనందయ్య మందు మీద నమ్మకం ఉందని, ఆయుర్వేదాన్ని తాను నమ్ముతానని బాలయ్య అన్నాడు. భారత దేశ ఆయుర్వేదానికి గొప్ప చరిత్ర ఉందని.. క్రీస్తు పూర్వంలోనే సుశ్రుతుడు అనే శస్త్రచికిత్స నిపుణుడు ఉండేవాడని.. ఆయన ఎన్నో సర్జరీలు చేశాడని.. మనం ఆయన్ని గుర్తుంచుకోకుండా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో రాయల్ కాలేజ్ ఫర్ సర్జరీలో తన విగ్రహం ఉందని బాలయ్య వివరించాడు.

అలాగే రాజమండ్రికి చెందిన దండిబట్ల విశ్వనాథ శాస్త్రిని నాజీలు తీసుకెళ్లి.. శరీర నిర్మాణం, వైద్యం గురించి వివరించే యజుర్వేదం, అధర్వణ వేదాలను తమ భాషల్లో తర్జుమా చేయించుకుని తమ వైద్య శాస్త్రాలను అభివృద్ధి చేసుకున్నారని బాలయ్య అన్నాడు. ఇలా భారతీయ ఆయుర్వేదానికి గొప్ప చరిత్ర ఉందని.. దాని గురించి చాలామందికి తెలియదని.. ఐతే మిగతా వాళ్లతో పోలిస్తే తనకు దీనిపై కొంచెం అవగాహన ఉందని.. ఆనందయ్య తయారు చేసే మందులో ఉపయోగించే పదార్థాలతో మందులు తయారు చేయడం ఎప్పట్నుంచో ఉన్నదే అని బాలయ్య వ్యాఖ్యానించాడు.