కరోనా టైంలో ఇండియాలోని సూపర్ స్టార్లందరినీ మించి పోయి రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూ సూద్. గత ఏడాది లాక్ డౌన్ పెట్టాక అష్ట కష్టాలు పడుతున్న వలస కార్మికులను వారి గమ్య స్థానాలకు చేర్చడంతో మొదలుపెట్టి అతను అనితర సాధ్యమైన స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపట్టాడు. ఈ ఏడాది సెకండ్ వేవ్ టైంలో మరింతగా సేవా కార్యక్రమాలను విస్తరించాడు సోనూ.
దేశవ్యాప్తంగా లక్షల మంది సాయం కోసం ప్రభుత్వాలను అడగడం మానేసి సోనూకు విజ్ఞప్తులు పెడుతుండటం గమనార్హం. అందులో సాధ్యమైనంత మందిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు సోనూ. మందులిస్తున్నాడు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఇస్తున్నాడు. ఏకంగా ఆక్సిజన్ ప్లాంటులే ఏర్పాటు చేస్తున్నాడు. అన్నీ కూడా ఉచితమే. ఐతే ఒక్క సోనూ ఇంతమందిని ఎలా ఆదుకోగలుగుతున్నాడు.. అతడి దగ్గర అన్ని డబ్బులెక్కడివి అనే సందేహాలు అందరినీ వెంటాడుతున్నాయి.
ఓ ఇంటర్నేషనల్ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాడు సోనూ. తాను గత ఏడాది చేసిన సేవా కార్యక్రమాలు చూసి ఎంతోమంది స్ఫూర్తి పొందారని, వారిలో చాలామంది తనను సంప్రదించారని.. తాము ఇందులో భాగస్వాములవుతామని చెప్పారని సోనూ వెల్లడించాడు. తన మీద నమ్మకంతో వాళ్లు విరాళాలు ఇవ్వడంతో పాటు అనేక రకాలుగా సేవలో భాగస్వాములు అవుతున్నారని సోనూ చెప్పాడు. తన దగ్గరున్న డబ్బుకు ఈ విరాళాలు కూడా చేర్చి సోనూ సూద్ ఫౌండేషన్ ద్వారా ఈ మంచి పనులన్నీ చేయగలుగుతున్నానని సోనూ వెల్లడించాడు.
తన ద్వారా సాయం పొందిన వాళ్ల స్పందన చూశాక, ఎన్నో ప్రాణాలు నిలబడ్డాక కలుగుతున్న సంతృప్తి మాటల్లో వర్ణించలేనిదని.. మరింతగా సేవా కార్యక్రమాలు చేపట్టడానికి అదే స్ఫూర్తిగా నిలుస్తోందని సోనూ వెల్లడించాడు. కేవలం కరోనా బాధితుల్ని ఆదుకోవడంతో తాను ఆగిపోవట్లేదని.. లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లను ఆదుకునేందుకు భారీ ప్రణాళికలే రచించామని.. కంపెనీల భాగస్వామ్యంతో ఇప్పటికే 2 లక్షల మందికి ఉపాధి కల్పించామని.. లక్షల మందికి స్కిల్స్ నేర్పించి వారికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత చేపట్టామని సోనూ వెల్లడించాడు.