మ‌హేష్ జాన‌ర్లు చెప్పిన త‌మ‌న్

టాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాల గురించి ఎవరైనా ఏదైనా విశేషాలను మీడియాతో పంచుకుంటే ఆసక్తితో చూస్తారు వాళ్ల అభిమానులు. అందులోనూ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ల సినిమాల ముచ్చట్లంటే మరీ ఆసక్తిని ప్రదర్శిస్తారు. ప్రస్తుతం తెలుగులో హాట్ షాట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమన్.. వరుసగా సూపర్ స్టార్లతోనే సినిమాలు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’తో పాటు ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్‌‌కూ తమనే సంగీత దర్శకుడన్న సంగతి తెలిసిందే.

అలాగే మహేష్ బాబు కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’తో పాటు అతను తర్వాత నటించబోయే త్రివిక్రమ్ సినిమాకు కూడా తమనే సంగీత దర్శకుడిగా ఖరారయ్యాడు. ఈ రెండు చిత్రాల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో కొన్ని విశేషాలు పంచుకున్నాడు తమన్. ఈ చిత్రాలు ఏ జానర్లో తెరకెక్కుతున్నాయో అతను వెల్లడించాడు.

ముందుగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ గురించి మాట్లాడుతూ.. ఇది పూర్తి స్థాయి మాస్ మూవీ అని తమన్ చెప్పాడు. ఈ సినిమా ఎంతో వినోదభరితంగా ఉంటుందని.. ఎంటర్టైన్మెంట్‌తో పాటు యాక్షన్‌కు లోటు ఉండదని చెప్పిన తమన్.. ఒక్క మాటలో ఇది ‘హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్’ అని అభివర్ణించాడు. ‘సర్కారు వారి పాట’కు తమన్‌ సంగీత దర్శకుడిగా ఎప్పుడో ఖరారు కాగా.. త్రివిక్రమ్-మహేష్ సినిమాకు అతనే మ్యూజిక్ చేస్తాడని ఇంకా అధికారికంగా అయితే ప్రకటించలేదు. కానీ తమన్ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తానే ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నట్లు ధ్రువీకరించాడు.

ఈ సినిమా కొత్త జానర్లో తెరకెక్కబోతున్నట్లు తమన్ వెల్లడించాడు. త్రివిక్రమ్ అంటే వేరే తరహాలో సినిమాలు చేస్తాడన్న సంగతి తెలిసిందే అంటూ, ఈ సినిమా చాలా కొత్తగా ఉండబోతుందని తమన్ చెప్పాడు. త్రివిక్రమ్-మహేష్ కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘అతడు’ కంటే ఇది గొప్పగా ఉంటుందని.. చాలా ఏళ్ల తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఇది చాలా ప్రత్యేకంగా ఉండాలని భావిస్తున్నారని తమన్ చెప్పాడు.