ఇంత బోల్డ్‌నెస్ త‌ట్టుకోగ‌ల‌రా?

ఏక్ మిని క‌థ‌.. తెలుగు రాష్ట్రాల్లో మ‌రోసారి థియేట‌ర్లు మూత ప‌డ్డ వేళ నేరుగా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిన మ‌రో చిన్న సినిమా. గ‌త నెల 30న థియేట‌ర్ల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌నుకున్నారు కానీ.. థియేట‌ర్లు మూత ప‌డ‌టంతో వాయిదా వేయక త‌ప్ప‌లేదు. త‌ర్వాత చూస్తే ఇప్పుడిప్పుడే థియేట‌ర్లు తెరుచుకునే అవ‌కాశం లేక‌పోవ‌డంతో అమేజాన్ ప్రైమ్ వాళ్ల‌తో డీల్ కుదుర్చుకుని నేరుగా డిజిట‌ల్ రిలీజ్ చేయ‌డానికి రెడీ అయిపోయారు మేక‌ర్స్.

ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్లు కూడా కొంచెం గ‌ట్టిగానే చేస్తున్నారు. ఈ సినిమా తెలుగులో ఇప్ప‌టిదాకా చూడ‌ని ఒక బోల్డ్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కింది. ఆ కాన్సెప్ట్ గురించి ఇప్ప‌టిదాకా మీడియా వాళ్లు కూడా త‌మ వార్త‌ల్లో రాయ‌లేక పోతుండ‌టం గ‌మ‌నార్హం. దీని టీజ‌ర్, ట్రైల‌ర్ గురించి వార్త‌లు రాస్తున్న‌పుడు కూడా కాన్సెప్ట్ గురించి రాయ‌డానికి మొహ‌మాట‌ప‌డిపోతున్నారు.


ఓపెన్‌గా మాట్లాడుకోవాలంటే ఏక్ మిని క‌థ‌లో హీరో అంగం చిన్న‌ది. దాని గురించి అత‌ను తెగ ఫీలైపోతుంటాడు. చివ‌రికి ఎన్‌లార్జింగ్ స‌ర్జ‌రీ చేయించుకుని అంగాన్ని పెంచుకోవాల‌నుకుంటాడు. ఈ క‌ష్టాల నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్ర‌మిది. ఐతే మాట్లాడుకోవ‌డానికే ఏదోలా అనిపించే ఇలాంటి కాన్సెప్ట్ మీద తెలుగులో ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమా రావ‌డం అంటే ఆశ్చ‌ర్య‌మే. గ‌త కొన్నేళ్లలో ప్రేక్ష‌కుల అభిరుచి ఎంత మారినా.. బోల్డ్ కాన్సెప్ట్స్‌ను బాగానే స్వాగ‌తిస్తున్నా.. ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా తీసే సాహ‌సం చేయ‌డం విశేష‌మే.

ఐతే దీన్నో బూతు చిత్రం అనుకోకుండా ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌లాగే తీసిన‌ట్లున్నారు యువి వాళ్లు. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ ఈ చిత్రానికి క‌థ ఇవ్వ‌డం విశేషం. కార్తీక్ రాపోలు అనే కొత్త ద‌ర్శ‌కుడు డైరెక్ట్ చేశాడు. ఒక‌ప్పుడు బాలీవుడ్లో వీర్య దానం మీద విక్కీ డోన‌ర్ తీసిన‌పుడు మొద‌ట అందరూ ఇలాంటి కాన్సెప్ట్ మీద సినిమానా అన్నారు. కానీ సినిమా చూసి అంద‌రూ మెచ్చుకున్నారు. ఫ్యామిలీస్‌ను కూడా ఆ చిత్రం బాగా ఆక‌ట్టుకుంది. తెలుగులో ఇప్పుడు ఏక్ మిని క‌థ అలాంటి ప్ర‌య‌త్న‌మే అనుకోవ‌చ్చు. మ‌రి మ‌న ప్రేక్ష‌కులు దీన్ని ఏమేర స్వాగతిస్తారో.. సినిమాకు ఎలాంటి స్పంద‌న ద‌క్కుతుందో చూడాలి.