ఆచార్య.. ఇంకో 10 రోజులు ఆగి ఉంటే

అంతా అనుకున్న ప్రకారం జరిగితే ఈపాటికి ‘ఆచార్య’ సినిమా థియేటర్లలో సందడి చేస్తుండాలి. కానీ కరోనా సెకండ్ వేవ్ పుణ్యమా అని ప్రణాళికలన్నీ తారుమారు అయ్యాయి. చాలా సినిమాల మాదిరే ఇది కూడా వాయిదా పడిపోయింది. ఐతే ఈ సినిమా ఎంత వరకు పూర్తయింది.. ఇంకా ఎంత మిగిలి ఉంది.. మళ్లీ ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.. అన్నదానిపై ప్రేక్షకుల్లో స్పష్టత లేదు. ఐతే తాజాగా ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో కొరటాల శివ ఈ విశేషాలపై మాట్లాడాడు.

‘ఆచార్య’ చిత్రీకరణను గత ఏడాది జనవరిలో మొదలుపెట్టామని.. ఐతే తొలి షెడ్యూల్లో కొన్ని రోజులు మాత్రమే చిత్రీకరణ జరిగిందని.. పాటతో పాటు కొన్ని సన్నివేశాలు మాత్రమే చిత్రీకరించామని.. ఆ తర్వాత కరోనా-లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆపేయాల్సి వచ్చిందని కొరటాల చెప్పాడు. ఈ విరామం తర్వాత గత ఏడాది చివర్లో మళ్లీ షూటింగ్ మొదలుపెట్టామని.. ఈసారి మాత్రం చాలా బాగా చిత్రీకరణ సాగిందని.. మూణ్నాలుగు నెలల్లో చాలా వరకు చిత్రీకరణ పూర్తయిందని కొరటాల చెప్పాడు. ఇంకో పది పన్నెండు రోజులు చిత్రీకరణ జరిపి ఉంటే సినిమా టాకీ పార్ట్ అంతా పూర్తయ్యేదని కొరటాల చెప్పాడు.

షూటింగ్ ఆపేయడానికి ముందు ఫారెస్ట్ షెడ్యూల్ జరిగిందని.. అందులో కీలక సన్నివేశాలు చిత్రీకరించామని.. కరోనా సెకండ్ వేవ్ గురించి చర్చ మొదలైనపుడు కూడా జోరుగా షూటింగ్ చేశామని.. కానీ ఇంతలో తీవ్రత పెరిగిపోయిందని.. చిరంజీవి సహా అందరినీ రిస్క్‌లో పెట్టడం కరెక్ట్ కాదనిపించి షూటింగ్ ఆపేశామని కొరటాల చెప్పాడు. పరిస్థితులు చక్కబడ్డాక సాధ్యమైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి, సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవడానికి ప్రయత్నిస్తామని కొరటాల చెప్పాడు. కొరటాల మాటల్ని బట్టి చూస్తుంటే ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి అవకాశముంది.