ఎన్టీఆర్‌తో అనిరుధ్?

తమిళంలో రజినీకాంత్, విజయ్, అజిత్, సూర్య, ధనుష్ లాంటి బడా స్టార్లతో సినిమాలు చేశాడు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. అతను చేసిన సినిమాల్లో ఏవి ఎలా ఆడాయన్నది పక్కన పెడితే.. మ్యూజికల్‌గా మాత్రం అన్నీ హిట్లే. హీరోలకు మంచి ఎలివేషన్లు ఇచ్చే మాస్ సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో అతను థియేటర్లను హోరెత్తించేస్తుంటాడు. అతడికి తెలుగులోనూ సినిమాలు చేసే అవకాశం దక్కింది.

టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘అజ్ఞాతవాసి’తో ఇచ్చాడు అనిరుధ్. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఆ ప్రభావం అనిరుధ్ మీద పడింది. తర్వాత అనిరుధ్ నానీతో చేసిన జెర్సీ, గ్యాంగ్ లీడర్ అతడికి మంచి పేరే తెచ్చాయి. అయినా సరే.. తెలుగులో అనిరుధ్ కెరీర్ అంతగా ఊపందుకోలేదు. ఐతే ఇప్పుడు మళ్లీ అనిరుధ్ ఒక భారీ చిత్రంతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇప్పటిదాకా సంగీత దర్శకుడిని ఖరారు చేయలేదు. కొరటాల తొలి నాలుగు చిత్రాలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఐతే ఐదో సినిమా ‘ఆచార్య’కు మాత్రం సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మను ఎంచుకున్నాడాయన. కొరటాలకు దేవి మంచి ఆడియోలు ఇచ్చినప్పటికీ.. గత రెండేళ్లలో అతడి జోరు కొంచెం తగ్గిన నేపథ్యంలో వేరే దర్శకుల్లాగే కొరటాల కూడా అతణ్ని పక్కన పెట్టేసినట్లుంది.

అలాగని ఇప్పుడు కలిసి పని చేస్తున్న మణిశర్మనూ తర్వాతి చిత్రానికి కొనసాగించాలనుకోవట్లేదట. ఈ క్రమంలోనే అనిరుధ్ వైపు ఆయన చూస్తున్నట్లు సమాచారం. మళ్లీ ఓ పెద్ద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు తన సత్తా ఏంటో చూపించాలని చూస్తున్న అనిరుధ్.. ఈ సినిమాకు సంతోషంగా ఒప్పుకున్నాడని.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. నిజానికి ‘అజ్ఞాతవాసి’ చేస్తున్న సమయంలోనే తారక్‌తో త్రివిక్రమ్ కమిటైన ‘అరవింద సమేత’కు అనిరుధ్‌ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. కానీ ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ కావడంతో అతణ్ని పక్కన పెట్టి తమన్‌కు ఛాన్సిచ్చాడు త్రివిక్రమ్.