కరోనా వేళ అపరిమితమైన సేవా కార్యక్రమాలతో నేషనల్ హీరోగా నిలిచాడు సోనూ సూద్. కొవిడ్ వేళ సెలబ్రెటీల్లో కొందరు తమకేమీ పట్టనట్లు ఊరుకుండిపోయారు. కొందరు విరాళాలు ప్రకటించారు. కొందరేమో తమకు వీలైనంతలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కానీ సోనూ లాగా ఒక పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేసుకుని భారీగా ఖర్చు పెడుతూ సేవా కార్యక్రమాలు చేయడం అంటే అందరికీ సాధ్యమయ్యే పని కాదు.
దానికి కేవలం డబ్బులతో పాటు ఎంతో సమయం, ఓపిక కూడా కావాలి. సెలబ్రెటీల దగ్గర డబ్బులకు లోటుండదు కానీ.. సమయం, ఓపిక మాత్రం తక్కువే ఉంటుంది. ఈ కల్లోల సమయంలో ఎక్కువ టెన్షన్ తీసుకోవాలని వాళ్లు అనుకోరు. అందుకే సోనూకు వస్తున్న పేరును చూసి అసూయ చెందే వాళ్లు చాలామంది అతడిలా మన వల్ల కాదని ఊరుకుంటున్నారు. ఐతే టాలీవుడ్లో ఓ యంగ్ హీరో మాత్రం తన వంతుగా ఇలాంటి ప్రయత్నమే మొదలుపెట్టి అభాగ్యులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతనేే.. నిఖిల్ సిద్దార్థ.
కరోనా సెకండ్ వేవ్ ధాటికి జనాలు అల్లాడిపోతుండటం చూసి కొన్ని రోజుల కిందట తన టీంతో రంగంలోకి దిగాడు నిఖిల్. ట్విట్టర్లో తనకు కనిపించే, తనను ట్యాగ్ చేస్తూ పెట్టే రిక్వెస్ట్‌లను చూసి వాళ్లకు ఏదో రకంగా సాయం చేయడానికి నిఖిల్ ప్రయత్నిస్తున్నాడు. కొందరికి నేరుగా తన టీం ద్వారా సాయం అందిస్తున్నాడు. ఇంకొందరికి సాయం అందే మార్గం చూపిస్తున్నాడు. ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేటు వ్యక్తులతోనూ సమన్వయం చేసుకుంటూ కొవిడ్ బాధితులను ఆదుకోవడానికి నిఖిల్ సిన్సియర్‌గానే ప్రయత్నిస్తున్నాడు. నిఖిల్ చొరవతో చాలామందికి అందాల్సిన సాయం అందుతోంది.
బ్లాక్ ఫంగస్ ఎటాక్ అయి ప్రమాదకర స్థితికి చేరుకున్న ఓ బాధితుడికి విరాళాలు అందేలా చేయడంతో పాటు ఆరోగ్యాంధ్ర ద్వారా అతడికి వైద్య సాయం సమకూరేలా చేయడంలో నిఖిల్ కీలక పాత్ర పోషించాడు. ఇలా మరింత మందికి సాయపడ్డాడు. సోనూ లాగా పెద్ద స్థాయిలో ఖర్చు పెట్టి వందలు, వేల మందిని ఆదుకోవడం అందరి వల్లా కాదు కానీ.. మన వల్ల ఏమవుతుంది అనుకోకుండా కుదిరినంత మేర ఇలా సాయం చేయడానికి ప్రయత్నించడం గొప్ప విషయమే. తన ఇమేజ్ పెంచుకోవడానికి ఇలా చేసి ఉన్నా కూడా అందులో తప్పేమీ లేదు. సోనూ కూడా తాను చేస్తున్న సేవ గురించి బాగానే ప్రచారం చేసుకుంటున్నాడు. ఉద్దేశాలు ఏమైనప్పటికీ ఇలాంటి సమయంలో మనం క్షేమంగా ఉంటే చాలు అనుకోకుండా ఇలా సేవలోకి దిగడం ప్రశంసనీయం.