కరోనా దెబ్బ.. జీఎస్టీ కట్టనన్న హీరోయిన్


కరోనా కల్లోల సమయంలో చిన్నా పెద్దా అనే తేడాలేమీ కనిపించడం లేదు. బాగా డబ్బున్న, సొసైటీలో పలుకుబడి ఉన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులు సైతం ఈ కల్లోల సమయంలో సరైన వైద్యం అందక.. ఆసుపత్రుల్లో బెడ్స్ దొరక్క.. సమయానికి ఆక్సిజన్ అందక.. అత్యవసర మందులు లభించక ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు ఎన్నో చూస్తున్నాం. సౌత్‌ సినిమాలతో పాటు బాలీవుడ్లోనూ నటించిన హీరోయిన్ మీరా చోప్రా కుటుంబంలో సైతం ఇలాంటి విషాదాలే చోటు చేసుకున్నాయి.

వారం రోజుల వ్యవధిలో మీరా కుటుంబంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వాళ్లిద్దరూ తక్కువ వయసున్న వ్యక్తులే కావడం గమనార్హం. ముందుగా ఏప్రిల్ 29న మీరా చోప్రా ఒక ట్వీట్ వేసింది. తన కజిన్ ఒకరు కరోనా బారిన పడి పరిస్థితి విషమిస్తే సరైన సమయానికి ఆసుపత్రిలో బెడ్ లభించలేదని, అది దొరికేసరికి ఊపిరి తిత్తులు పూర్తిగా పాడయ్యాయని.. తర్వాత అతను చనిపోయాడని మీరా పేర్కొంది. ఇది కొవిడ్ మరణమా.. హత్యా అని ప్రశ్నించిన మీరా.. ప్రభుత్వం సరైన వైద్య సదుపాయాలు కల్పించకపోవడం వల్లే అతను ప్రాణాలు కోల్పోయాడని అంది.

ఇది జరిగిన ఇంకో వారం రోజులకే మీరా కజిన్ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన మీరా.. మరోసారి ప్రభుత్వ పనితీరును తప్పుబట్టింది. ఇండియాలో పరిస్థితులపై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కింది. తాజాగా ఆమె ఆసుపత్రుల్లో తాను ఇక జీఎస్టీ చెల్లించబోనంటూ మరో ట్వీట్ వేసింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక బెడ్ కూడా దొరకనపుడు జీఎస్టీ ఎందుకు కట్టాలన్నది ఆమె ప్రశ్న. మీరా ఆవేశంలో ఈ మాట అంటోందని, నిజంగా పన్ను కట్టడం మానేస్తుందా అనిపించొచ్చు కానీ.. వారం వ్యవధిలో ఓ కుటుంబంలో రెండు విషాదాలు చోటు చేసుకున్నపుడు కలిగే ఆవేదన ఇలాగే ఉంటుంది మరి.