చిరంజీవి మాస్ టైటిల్.. కామెడీ సినిమాకు


పాపులర్ పాత సినిమాల టైటిళ్లను కొన్నేళ్ల విరామం తర్వాత మళ్లీ వాడుకోవడం మామూలే. మెగాస్టార్ చిరంజీవి సినిమాల టైటిళ్లతో వేరే సినిమాలు చాలానే వచ్చాయి. రాక్షసుడు, ఖైదీ, దొంగ లాంటి టైటిళ్లను తమిళ డబ్బింగ్ సినిమాలకు వాడుకోవడం విశేషం. ఇక చిరు నటించిన మరి కొన్ని ప్రముఖ చిత్రాల టైటిళ్లను తెలుగులో కామెడీ సినిమాలకు ఉపయోగించడం గమనార్హం. అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘యముడికి మొగుడు’ టైటిల్‌ను అల్లరి నరేష్ కామెడీ మూవీకి వాడుకోవడం తెలిసిందే.

ఇక ‘గ్యాంగ్ లీడర్’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ను నాని చేసిన కామెడీ ఎంటర్టైనర్‌కే పెట్టుకున్నారు. దీని పట్ల వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. కాగా ఇప్పుడు మెగాస్టార్ మరో మాస్ టైటిల్‌ను ఇంకో కామెడీ సినిమాకు పెట్టేశారు. చిరు త్రిపాత్రాభినయం చేసిన ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమా టైటిల్‌ను ఓ చిన్న సినిమా కోసం తీసుకున్నారు.

కమెడియన్ కమ్ హీరో శ్రీనివాసరెడ్డి ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న సినిమా ‘ముగ్గురు మొనగాళ్లు’. సినిమాలో ఈయనొక మొనగాడు అయితే.. కన్నడ ‘దియా’ సినిమా ఫేమ్ దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు మిగతా ఇద్దరు మొనగాళ్లుగా కనిపించనున్నారు. అభిలాష్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అప్పర్ల సాయి కళ్యాణ్ స్క్రిప్టుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. అచ్యుత్ రామారావు ఈ ‘ముగ్గురు మొనగాళ్లు’ను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

ఫస్ట్ లుక్‌లో హీరోలను కోతుల్లాగా చూపించి ఇది పక్కా కామెడీ మూవీ అనే సంకేతాలు ఇచ్చారు. ‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ లాంటి సినిమాలతో హీరోగా మొదట్లో శ్రీనివాసరెడ్డి మంచి ఊపులోనే కనిపించాడు. కానీ తర్వాత హీరోగా చేసిన ‘జంబలకిడి పంబ’తో పాటు స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘భాగ్యనగర వీధుల్లో’ ఫ్లాప్ కావడంతో అతడి జోరు తగ్గింది. ఇప్పుడతను ‘హౌస్ అరెస్ట్’తో పాటు ‘ముగ్గురు మొనగాళ్లు’లో హీరోగా నటిస్తున్నాడు.