కరోనా వేళ ఎంతో ఆరోగ్యంగా ఉన్న వాళ్లు ఉన్నట్లుండి కన్ను మూస్తున్నారు. ఒకప్పుడైతే ఇలాంటి వార్తలు చూస్తే ఆశ్చర్యపోయేవాళ్లు. షాకయ్యేవాళ్లు. నమ్మశక్యంగా అనిపించేది కాదు. కానీ ఇలాంటి మరణాలు మామూలైపోతుండటంతో జనాలు కూడా అలవాటు పడిపోతున్నారు. ఒక నిమిషం నిట్టూర్చి అయ్యో అనుకుని ముందుకెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో కొన్ని ఫేక్ వార్తలు కూడా నిజాలుగా చలామణి అయిపోతున్నాయి.
గత ఏడాది కాలంలో ఇలా సోషల్ మీడియాలో ప్రచారమైన అబద్ధపు చావులు చాలానే ఉన్నాయి. సింగర్ లక్కీ అలీతో పాటు నటుడు ముకేష్ ఖన్నా చనిపోయినట్లు ఇటీవల జోరుగా ప్రచారాలు సాగిన సంగతి తెలిసిందే. ఈ వార్తలు అబద్ధం అంటూ వాళ్లు స్వయంగా వివరణ ఇచ్చుకోవల్సి వచ్చింది పాపం. ఇప్పుడు ఈ కోవలోనే సీనియర్ నటుడు పరేష్ రావల్ సైతం చెప్పుకోవాల్సి వచ్చింది.
తాను మరణించినట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచయారాన్ని పరేష్ రావల్ ఖండించారు. ‘‘నేను చనిపోలేదు ఎక్కువ సేపు నిద్రపోయానంతే’’ అంటు ఆయన స్పష్టత ఇచ్చారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు పరేష్ రావల్ మరణించినట్లుగా ట్విటర్లో ఓ నెటిజన్ పోస్టు షేర్ చేశాడు. అది కాసేపటికే జోరుగా ప్రచారంలోకి వెళ్లిపోయింది.
ఈ విషయం రావల్ వరకు వచ్చి.. ఆయన స్పందించారు. ‘‘నా గురించి అపోహ కలిగించిందుకు మన్నించాలి. ఉదయం 7 దాటాక కూడా ఎక్కువ సమయం నిద్రపోయానంతే. నేను మరణించలేదు’’ అంటూ చేతులు జోడించిన ఎమోజీని జత చేశాడు పరేష్ రావల్. ఇలా సెలబ్రెటీలు చనిపోయినట్లు వార్తలు పుట్టించి పైశాచిక ఆనందం పొందే వారి గురించి ఎలా స్పందించాలో అర్థం కాదు. ఇలాంటి ప్రచారాలు సాగించే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటే తప్ప మిగతా వాళ్లు ఇలాంటి పనుల జోలికి వెళ్లరు.