50 మంది కొత్త తారల కలకు బ్రేక్

Teja


తెలుగులో కొత్త నటీనటులు, టెక్నీషియన్లకు అత్యధికంగా అవకాశాలు ఇచ్చిన దర్శకుల్లో తేజ ఒకడు. తొలి సినిమా ‘చిత్రం’తోనే ఉదయ్ కిరణ్, రీమా సేన్, ఆర్పీ పట్నాయక్ లాంటి ప్రతిభావంతులకు బ్రేక్ ఇచ్చిన తేజ.. ఆ తర్వాత మరెంతో మంది నటీనటలు, టెక్నీషియన్లను వెలుగులోకి తెచ్చాడు. ‘చిత్రం’ సినిమా విడుదలై రెండు దశాబ్దాలు కావస్తున్న తరుణంలో కొన్ని నెలల కిందట తేజ ‘చిత్రం 2.0’ పేరుతో కొత్త సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

‘చిత్రం’ తరహాలోనే దీన్ని కూడా అందరూ కొత్త వాళ్లతో చేయాలనుకున్నాడు తేజ. 50 మంది కొత్త నటీనటులను ఈ సినిమా కోసం ఎంపిక చేసుకోవడం విశేషం. స్వీయ నిర్మాణంలో ఈ సినిమా చేయడానికి తేజ సిద్ధమయ్యారు. స్క్రిప్టు సిద్ధం చేసి, ఆడిషన్స్ ద్వారా నటీనటులను ఎంపిక చేసుకుని.. వారికి శిక్షణ కూడా ఇచ్చిన తేజ.. త్వరలోనే ఈ సినిమా మొదలుపెట్టడానికి ఆయన సన్నాహాల్లో ఉండగా.. కరోనా సెకండ్ వేవ్ దెబ్బ కొట్టింది. ఇప్పుడు ఈ సినిమా చేయడానికి తగిన ఆర్థిక వనరులు తేజ దగ్గర లేవట. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త వాళ్లతో సినిమా తీయడం కష్టమని భావించి ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టాడట తేజ.

దీంతో ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న 50 మంది కొత్త ఆర్టిస్టులకు నిరాశ తప్పలేదు. ఈ ప్రాజెక్టును పూర్తిగా ఆపేయట్లేదని.. తాత్కాలికంగా దానికి విరామం ఇస్తున్నాడని.. దీని బదులు రానా తమ్ముడు అభిరామ్‌‌ను హీరోగా పరిచయం చేస్తూ సురేష్ ప్రొడక్షన్స్‌లో సినిమా చేయబోతున్నాడట తేజ. ఈ సినిమాతో హిట్టు కొట్టి డబ్బులు సమకూరితే, అలాగే కరోనా సంక్షోభం ముగిసిపోతే.. ఆ తర్వాత ‘చిత్రం-2.0’ను పట్టాలెక్కించాలని తేజ యోచిస్తున్నాడట. టాలీవుడ్లో షూటింగ్స్ పున:ప్రారంభం అయ్యాక అభిరామ్‌తో తేజ సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని తెలుస్తోంది.