ప్రియదర్శి ‘కొవిడ్’ పంచ్ అదుర్స్

కమెడియన్ ప్రియదర్శి కెరీర్‌ను ‘పెళ్ళిచూపులు’కు ముందు, ‘పెళ్ళిచూపులు’కు తర్వాత అని విభజించి చూడాల్సిందే. ఆ సినిమాకు ముందు కూడా అతను కొన్ని చిత్రాల్లో నటించాడు. కానీ అవేవీ అతడికి అంతగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. కానీ ‘పెళ్ళిచూపులు’లో హీరో ఫ్రెండుగా అతను చేసిన కామెడీకి ప్రేక్షకులు భలేగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా సినిమా చివర్లో అనీష్ కురువిల్లా వచ్చి నువ్వేం చేస్తుంటావని అడిగితే.. బుక్కు రాస్తున్నా అనడం.. ఏం బుక్ అని అడిగితే.. ‘నా సావు నేను చస్తా. నీకెందుకు’ అని బదులిచ్చే డైలాగ్ ఎంతగా పేలిందో తెలిసిందే. ఆ ఒక్క డైలాగ్‌తో అతను ఎనలేని పేరు సంపాదించి బిజీ కమెడియన్ అయిపోయాడు. ఈ డైలాగ్‌ను ఎంతోమంది ఎన్నో రకాలుగా వాడుకున్నారు. మీమ్స్‌కైతే లెక్కే లేదు. ఇప్పుడు కరోనా మీద అవగాహన కల్పించడానికి ప్రియదర్శి తన ఫేమస్ డైలాగ్‌నే ఉపయోగించుకున్నాడు.

ప్రస్తుతం కరోనా ఏ స్థాయిలో కల్లోలం రేపుతోందో తెలిసిందే. ఇప్పటికీ మాస్కు ఆవశ్యకతను గుర్తించని జనాలు ఎంతోమంది ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిలో అవగాహన పెంచేందుకు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు ప్రియదర్శి. మాస్కు లేని ఫొటో ఒకటి పెట్టి.. దానికి ‘నా సావు నేను చస్తా. నీకెందుకు’ అని క్యాప్షన్ పెట్టాడు.

మాస్కు పెట్టుకున్న మరో ఫొటోను షేర్ చేసి.. దానికి ‘నా బతుకు నేను బతుకుతా. నా అవసరం’ అని క్యాప్షన్ జోడించాడు. మాస్కు పెట్టుకుంటేనే బతుకుతారని.. అది తీసేస్తే ప్రమాదం తప్పదని చాలా చక్కగా, సింపుల్‌గా చెప్పేశాడు ప్రియదర్శి. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ప్రియదర్శి కెరీర్ విషయానికి వస్తే.. అది మంచి ఊపులోనే ఉంది. అతను ప్రధాన పాత్రలో నటించిన ‘మెయిల్’ ఓటీటీలో, ముగ్గురు హీరోల్లో ఒకడిగా నటించిన ‘జాతిరత్నాలు’ థియేటర్లలో అద్భుత స్పందన తెచ్చుకున్న సంగతి తెలిసిందే.