విలన్ వెళ్లిపోతేకానీ ‘పుష్ప’ ఆపలేదు

అనేక విమర్శలు అనంతరం ‘పుష్ప’ షూటింగ్ ఆగింది. కరోనా రిస్క్ ని కూడా ప్రక్కన పెట్టి గత కొద్ది రోజులుగా షూట్ చేస్తున్న టీమ్ బ్రేక్ తీసుకున్నారు. ఈ వారంలో ఈ చిత్రం హీరో అల్లు అర్జున్ ..కు కరోనా సోకినా కూడా షూటింగ్ ఆపలేదు. డేట్స్ సమస్య వస్తుందని భావించి జాగ్రత్తలు తీసుకుంటూనే మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ తో షూటింగ్ కొనసాగించారు. అయితే ప్రస్తుతం రోజు రోజుకీ పెరిగిపోతున్న కరోనా కేసులు, మరణాలు గమనించిన ఫహద్‌ ఫాజిల్‌ కొచ్చిన్ వెళ్లిపోయారు. దాంతో సుకుమార్ షూటింగ్ ఆపు చేసారు.

ఇక అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ తెరకెక్కుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్‌గా కనిపించనున్నారు. బన్నీ సరసన రష్మిక సందడి చేయనుంది. ఫహద్‌ ఫాజిల్‌ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

ఫహద్‌ తన పాత్ర గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘దర్శకుడు సుకుమార్‌ చెప్పిన స్ర్కిప్టు నాకు చాలా బాగా నచ్చింది. ఈ భారీ యాక్షన్‌ చిత్రంలో భాగస్వామిని అయినందుకు ఆనందంగా ఉంది. ఇందులో నా పాత్ర విభిన్నంగా ఉండబోతుంది. నా కెరీర్‌లో ఇప్పటి వరకు ఇలాంటి విభిన్న పాత్ర పోషించలేదు’ అని తెలిపారు. ‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత బన్నితో సుకుమార్ తెరకెక్కిస్తోన్న సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. సౌండ్‌ డిజైనర్‌గా ఆస్కార్‌ విజేత పూకుట్టిని తీసుకున్నట్టు ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.