ఎవరా స్టార్ హీరో కమ్ముల ?

సున్నితమైన కథాంశాలకు పెట్టింది పేరు శేఖర్ కమ్ముల. ఆయన చిత్రాల్లో భావోద్వేగాలు, వినోదం అన్నీ ఉంటాయి. కానీ రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల తరహాలో ఉండవు. అందుకే శేఖర్ కమ్ముల ప్రత్యేకమైన దర్శకుడు. కెరీర్ ఆరంభం నుంచి ఆయన మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు. తక్కువ బడ్జెట్ చిత్రాలని సూపర్ హిట్ చేస్తూ నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతున్నారు. 

ఒక్క స్టార్ హీరో కూడా శేఖర్ కమ్ములతో ఇంతవరకు సినిమా చేయలేదు. రెగ్యులర్ కమర్షియల్ హంగులు ఆయన చిత్రాల్లో లేకపోవడమే కారణం. మహేష్, రాంచరణ్ లాంటి హీరోలతో సినిమాలు చేయడానికి శేఖర్ కమ్ముల గతంలో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 

ప్రస్తుతం కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దీనితో శేఖర్ కమ్ముల తన తదుపరి చిత్రంపై ఫోకస్ పెట్టారు. ఓ స్టార్ హీరోని దృష్టిలో పెట్టుకుని అద్భుతమైన కథ సిద్ధం చేసుకుంటున్నారట. 

కమ్ముల సిద్ధం చేసుకుంటున్న కథ ఏంటి.. ఆ స్టార్ హీరో ఎవరు అనే చర్చ ఇండస్ట్రీలో మొదలయింది. స్టార్ హీరోతో సినిమా చేయాలంటే శేఖర్ కమ్ముల తన శైలిని ఎంతోకొంత మార్చుకోక తప్పదు. కానీ కమ్ముల అలా చేస్తారా అనేది ప్రశ్న. అలాగే లవ్ స్టోరీ సక్సెస్ పై కూడా కమ్ముల తదుపరి చిత్రం ఆధారపడి ఉంటుంది.