కమెడియన్ పొట్టి వీరయ్య గుండెపోటుతో మరణించిన మరుసటి రోజే టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఈసారి విషాదానికి కారణం కరోనా వైరస్. ఈ మహమ్మారి ధాటికి రచయిత, దర్శకుడు సాయి బాలాజీ ప్రసాద్ ప్రాణాలు వదిలాడు. ఆయన వయసు 57 ఏళ్లు. రియల్ స్టార్ శ్రీహరి నటించిన ‘శివాజీ’, ‘ఒరేయ్ తమ్ముడు’ చిత్రాలకు సాయి బాలాజీ దర్శకత్వం వహించాడు.
ఉదయ్ కిరణ్ చివరి సినిమా జై శ్రీరామ్ సైతం సాయిబాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిందే. సాయిబాలాజీ మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ బావగారూ బాగున్నారా స్క్రీన్ ప్లే రచయితల్లో ఒకరు కావడం విశేషం. సినిమాల్లో అవకాశాలు తగ్గాక సాయి బాలాజీ టీవీ సీరియళ్లకు పని చేశాడు. ‘సిరి’, ‘అపరంజి’, ‘హాలాహలం’.. వంటి సీరియళ్లకు ఆయన దర్శకత్వం వహించాడు.
సాయి బాలాజీతో పాటు ఆయన భార్య గౌరి, కుమార్తె స్నేహ పూజిత పది రోజుల కిందట కరోనా బారిన పడ్డారు. భార్య, కుమార్తె కోలుకున్నప్పటికీ.. సాయిబాలాజీ పరిస్థితి మాత్రం విషమించింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయిబాలాజీ మృతి చెందాడు. సాయిబాలాజీ స్వస్థలం తిరుపతి. సినిమాల మీద ఆసక్తితో టాలీవుడ్లోకి అడుగు పెట్టి రవిరాజా పినిశెట్టి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశారు.
ఆ తర్వాత శివాజీ సినిమాతో దర్శకుడిగా మారారు. సాయిబాలాజీ మరణవార్త తెలిసిన సినీ, టీవీ రంగాలకి చెందిన పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. గత ఏడాది కాలంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సహా వివిధ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు కరోనా మహమ్మారికి బలైన సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates