అఖిల్‌తో నాగ్ మల్టీస్టారర్ కన్ఫమ్


సీనియర్ హీరోలు వారి కొడుకులతో కలిసి మల్టీస్టారర్లు చేస్తే చూడాలని అభిమానులు ఎంతగానో ఆశపడతారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అభిమానుల కోరిక తీర్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు రామ్ చరణ్ నటించిన ‘మగధీర’లో చిన్న క్యామియో చేసిన చిరు.. ఇప్పుడు తన సినిమా ‘ఆచార్య’లో చరణ్‌కు ముఖ్య పాత్రే ఇప్పించాడు. ఈ సినిమాలో వీళ్లిద్దరినీ కలిసి తెరపై చూడటానికి అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

చిరు తరం సీనియర్ హీరో అయిన అక్కినేని నాగార్జున ఇంతకుముందు ‘మనం’ సినిమాలో నాగచైతన్యతో స్క్రీన్ షేర్ చేసుుకున్నాడు. ఆ చిత్రం అభిమానులకు ఒక మధుర జ్ఞాపకంలా మిగిలిపోయింది. ఆ చిత్రంలో ఏఎన్నార్ సైతం కీలక పాత్ర పోషించారు. అఖిల్ చిన్న క్యామియో రోల్‌లో మెరిశాడు. ఐతే ఇప్పుడు నాగార్జునతో కలిసి అఖిల్ మల్టీస్టారర్ మూవీకి రెడీ అవుతుండటం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జునే ధ్రువీకరించాడు.

తాను, అఖిల్ కలిసి నటించబోయే సినిమా ఎలా ఉండబోతోంది.. దాని దర్శకుడెవరు.. నిర్మాత ఎవరు అనే వివరాలేమీ చెప్పలేదు కానీ.. అఖిల్, తన కాంబినేషన్లో సినిమా కోసం వర్క్ జరుగుతున్నట్లు మాత్రం నాగ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. పెద్దబ్బాయి చైతూతో ‘మనం’లో నటించానని.. అలాగే రెండో అబ్బాయి అఖిల్‌తోనూ సినిమా చేయాలని ఉందని.. ఈ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని నాగ్ వెల్లడించాడు. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటించబోయే ‘ఏజెంట్’ సినిమా ఫస్ట్ లుక్ తనను ఎంతగానో ఇంప్రెస్ చేసిందని నాగ్ అన్నాడు.

‘వైల్డ్ డాగ్’ చిత్రానికి నెట్ ఫ్లిక్స్‌లో వస్తున్న స్పందన పట్ల నాగ్ హర్షం వ్యక్తం చేశారు. థియేటర్లలో రిలీజ్ చేసినపుడు చూసిన వాళ్లందరూ సినిమా బాగుందన్నారని, మంచి రివ్యూలు కూడా వచ్చాయని.. కానీ అప్పుడు జనాలు థియేటర్లకు రాలేదని, కరోనా సెకండ్ వేవ్ వల్లే సినిమాకు థియేటర్లలో ఆశించిన ఫలితం రాలేదని.. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్‌లో మంచి స్పందన వస్తుండటం సంతోషం అని నాగ్ అన్నాడు.