ఓటీటీలో దృశ్యం-2.. నిర్మాత క్లారిటీ

ఈ మధ్య తెలుగులో శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమా ‘దృశ్యం-2’. మలయాళంలో పెద్దగా అంచనాల్లేకుండా తెరకెక్కి, రెండు నెలల కిందటే అమేజాన్ ప్రైమ్‌లో విడుదలై అద్భుత స్పందన తెచ్చుకున్న ‘దృశ్యం-2’కు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ‘దృశ్యం’ రీమేక్‌లో నటించిన వెంకటేష్, ఇతర తారాగణాన్ని పెట్టి ఒరిజినల్ డైరెక్టర్ జీతు జోసెఫ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగి అటు ఇటుగా నెల రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఐతే కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మళ్లీ సంక్షోభంలో పడటంతో కొత్త సినిమాల విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ‘దృశ్యం-2’ను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని, వెంకీ దీని కంటే ముందు పూర్తి చేసిన ‘నారప్ప’ను వెనక్కి జరిపి ఈ సినిమాను ముందుకు తెస్తున్నారని కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది.

ఐతే ఈ విషయమై ‘దృశ్యం-2’ నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి జరుగుతున్న ప్రచారం అబద్ధమని ఆయన తేల్చేశారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘దృశ్యం-2’ థియేటర్ల కోసం సిద్ధం చేసిన సినిమా అని, పెద్ద తెర మీదే ముందు రిలీజవుతుందని, ఆ తర్వాతే ఓటీటీలోకి వస్తుందని సురేష్ స్పష్టం చేశారు. ఐతే ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో మాత్రం ఆయన చెప్పలేదు.

‘దృశ్యం-2’కు ఉన్న క్రేజ్ దృష్ట్యా థియేటర్ ఆదాయాన్ని కోల్పోవడానికి సురేష్ బాబు సిద్ధంగా లేనట్లున్నారు. ఎలాగూ మలయాళ వెర్షన్‌ థియేటర్లలో రిలీజ్ కాలేదు కాబట్టి ఈ థ్రిల్లింగ్ మూవీని వెండి తెరపై చూపించి ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇవ్వాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. ఐతే ఏది ముందు, ఏది తర్వాత అన్నది చెప్పలేం కానీ.. చాలా తక్కువ గ్యాప్‌లోనే ‘నారప్ప’, ‘దృశ్యం-2’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయన్నది మాత్రం స్పష్టం.