తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగానే కాక సాహితీ ప్రియుడిగా, రచయితగా, కవిగా గొప్ప పేరున్న వ్యక్తుల్లో తనికెళ్ల భరణి ఒకరు. అందరి వాడిగా ఉంటూ, వివాదాలకు దూరంగా ఉండే భరణి.. ఇప్పుడు అనుకోకుండా ఓ గొడవలో భాగమయ్యారు. ఆయనకు మంచి పేరు తెచ్చిన ‘శబ్బాష్ రా’ కవితలే ఇప్పుడు వివాదానికి దారి తీశాయి. ఈ పేరుతో ఓ పుస్తకం ప్రచురించడమే కాక.. కొనసాగింపుగా ఫేస్ బుక్ ద్వారా తరచుగా కొత్త కవితలు అందిస్తుంటారాయన.
సమకాలీన విషయాలకు ముడిపెడుతూ.. శివుడిని కీర్తించేలా ఉంటాయి ఈ కవితలు. ఐతే తాజాగా ఆయన పోస్ట్ చేసిన కవిత హేతువాదులకు ఆగ్రహం తెప్పించింది. భరణి మీద పెద్ద ఎత్తున వాళ్లు దండెత్తి వచ్చేలా చేసింది. గొడవ పెద్దదవుతుండటంతో భరణి తన కవిత పట్ల విచారం వ్యక్తం చేస్తూ, హేతువాదులకు బేషరతుగా క్షమాపణ కూడా చెప్పారు. ఇంతకీ వివాదానికి దారి తీసిన కవిత ఏంటంటే..
“గప్పాల్ గొడ్తరు గాడ్దె కొడుకులు
నువ్వుండగ లేవంటరు!
నువ్వున్నవో లేవో చెవుల జెప్పిపోరా
శబ్బాష్ రా శంకరా”
ఈ కవితలో దేవుడు లేడన్న వాళ్లను గాడిద కొడుకులుగా అభివర్ణించడంతో హేతువాదులకు మండిపోయింది. బాబు గోగినేని సహా ప్రముఖ హేతువాదులందరూ భరణి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో భరణి అప్రమత్తం అయ్యారు. ఒక వీడియో రిలీజ్ చేశారు. దురదృష్టవశాత్తూ తన కవిత కొందరు మనసుల్ని గాయపరిచిందని.. ఆ కవితకు వివరణ ఇస్తే కవరింగ్ లాగా ఉంటుందని.. కాబట్టి అదేమీ చేయకుండా తాను నొప్పించిన వాళ్లందరికీ బేషరతుగా క్షమాపణ చెబుతున్నానంటూ ఆయన చేతులెత్తి మొక్కారు. తనకు హేతువాదులన్నా, మానవతా వాదులన్నా గౌరవమే తప్ప వ్యతిరేకత ఎంతమాత్రం లేదని.. ఈ ప్రపంచంలో ఏ మనిషినీ నొప్పించే హక్కు ఎవరికీ లేదని.. కాబట్టి తన కవితను డెలీట్ చేసి ఇలా క్షమాపణ చెబుతున్నానని భరణి వివరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates