బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబో ఈజ్ బ్యాక్

ఈ మ‌ధ్య కొంచెం జోరు త‌గ్గి ఉండొచ్చు కానీ.. టాలీవుడ్ స్టార్ల‌కు మామూలు ఆడియోలు ఇవ్వ‌లేదు దేవిశ్రీ ప్ర‌సాద్. చాలామంది స్టార్ హీరోల‌కు వారి కెరీర్లో బెస్ట్ ఆడియోల జాబితా తీస్తే అందులో దేవిశ్రీ సంగీతం అందించిన సినిమాలు చాలానే ఉంటాయి. కొంద‌రు హీరోల కెరీర్ల‌కు మంచి ఊపు తేవ‌డంలో దేవి ఆడియోల పాత్ర కీల‌కం. అలా దేవి ఆడియోలను త‌న ఎదుగుద‌ల‌కు బాగా ఉప‌యోగించుకున్న హీరోల్లో రామ్ ఒక‌డు.

జ‌గ‌డం, రెడీ, శివ‌మ్, నేను శైల‌జ‌, ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ, హ‌లో గురూ ప్రేమ కోస‌మే.. దేవిశ్రీ సంగీతం అందించిన రామ్ సినిమాలివి. ఇందులో బ్లాక్ బ‌స్ట‌ర్లున్నాయి. హిట్లున్నాయి. ఫ్లాపులూ ఉన్నాయి. సినిమాల ఫ‌లితాల సంగ‌తెలా ఉన్నా.. ఆడియోలు మాత్రం అన్నీ హిట్టే. రామ్ కెరీర్లో అత్య‌ధిక చిత్రాల‌కు సంగీతాన్నందించిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ కూడా దేవీనే. కొంచెం గ్యాప్ ఇప్పుడు వీరి క‌ల‌యిక‌లో మ‌రో సినిమా రాబోతోంది.

త‌మిళ ద‌ర్శ‌కుడు లింగు స్వామితో ఇటీవ‌లే రామ్ ఓ సినిమాను మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్ బేన‌ర్ మీద పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి వివిధ భాషల్లో మంచి ఫేమ్ ఉన్న దేవిశ్రీ ప్ర‌సాద్‌ను సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంచుకున్నారు. మ‌ధ్య‌లో కొంచెం ఫామ్ కోల్పోయి.. ఈ మ‌ధ్య ఉప్పెన‌, రంగ్ దె లాంటి సినిమాల‌తో మ‌ళ్లీ సత్తా చాటిన దేవి.. రామ్ సినిమాకు మంచి ఎన‌ర్జీ ఉన్న మ్యూజిక్ ఇస్తాడ‌ని అంచ‌నా వేస్తున్నారు.

ప్ర‌స్తుతం దేవి పుష్ప లాంటి భారీ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇక రామ్-లింగుస్వామి సినిమా విష‌యానికొస్తే.. ఇందులో ఉప్పెన భామ కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇందులో మ‌రో హీరోయిన్ కూడా ఉందంటున్నారు. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్‌కు వెళ్ల‌నున్న ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది విడుద‌ల చేసే అవ‌కాశ‌ముంది.