చిరు టీం జగన్‌ దగ్గరికి వెళ్తుందా?


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లలో టికెట్ల ధరలపై నియంత్రణ తీసుకురావడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. సీఎం జగన్మోహన్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థి అయిన పవన్ కళ్యాణ్‌ను ఇబ్బంది పెట్టడానికే ఉన్నట్లుండి అధికార యంత్రాంతం, మంత్రులు టికెట్ల రేట్లపై నియంత్రణ తెచ్చారన్నది బహిరంగ రహస్యం.

ఐతే ఈ ఒక్క సినిమా వరకు పట్టుదల ప్రదర్శించి.. తర్వాత వచ్చే సినిమాలకు నియంత్రణ ఎత్తేస్తే ప్రభుత్వంపై విమర్శలు తప్పవు. అందరికీ ఒకే రకమైన నిబంధనలు పాటించక తప్పదు. అదే జరిగితే మున్ముందు రాబోయే రాబోయే పేరున్న సినిమాలకు ఇబ్బందులు తప్పవు. ఈ స్థితిలో ఇండస్ట్రీ జనాలు ఏం చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు పవన్ సినిమా విషయంలో జరుగుతున్న తంతుపై చోద్యం చూస్తున్న వాళ్లందరూ రేప్పొద్దున తమ సినిమాలకు ఇబ్బంది వస్తే ఏం చేస్తారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సాధ్యమైనంత త్వరగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ తరఫున ఒక ప్రతినిధుల బృందం.. ఏపీ సీఎం జగన్ వద్దకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. దాసరి తర్వాత ఇండస్ట్రీకి పెద్దగా మారిన చిరంజీవినే దీనికి నేతృత్వం వహించే అవకాశముంది.

ఇండస్ట్రీకి ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వ పెద్దలను కలవడానికి చిరు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఇంతకుముందు కూడా అమరావతికి వెళ్లి జగన్‌ను కలిసి వచ్చారు చిరు. హైదరాబాద్‌లోనూ రెండు మూడు సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లారు. వచ్చే నెలలోనో ఆ తర్వాతో తన సినిమా ఆచార్య విడుదల కాబోతోంది. వేరే పెద్ద సినిమాలు చాలానే ఉన్నాయి. అసలే కరోనా దెబ్బకు అల్లాడిన ఇండస్ట్రీ.. ఇప్పుడు ఏపీ సర్కారు అమలు చేస్తున్న టికెట్ల రేట్లతో మనుగడ సాధించడం కష్టమని, అవే ధరలు కొనసాగితే తమ సినిమాల బిజినెస్‌ లెక్కలే మారిపోతాయని, డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్ల నుంచి ఆందోళన తప్పదని.. అందుకే సాధ్యమైనంత త్వరగా జగన్‌ను కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని ఇండస్ట్రీ జనాలు సూచిస్తున్నారని.. త్వరలోనే చిరు బృందం జగన్‌ దగ్గరికి వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది.