రాజ‌శేఖ‌ర్-వ‌ర్మ సినిమా ఇన్నాళ్ల‌కు బ‌య‌టికి

రామ్ గోపాల్ వ‌ర్మ ఏ సినిమా ఎప్పుడు మొద‌లుపెడ‌తాడో.. ఎప్పుడు పూర్తి చేస్తాడో.. ఎప్పుడు రిలీజ్ చేస్తాడో తెలియ‌దు. ఆయ‌న ప్ర‌క‌టించిన ఆపేసిన.. అలాగే షూటింగ్ మ‌ధ్య‌లో వ‌దిలేసిన.. పూర్తి చేశాక ప‌క్క‌న పెట్టేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో ఒక‌టి.. ప‌ట్ట‌ప‌గ‌లు. సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన హార్ర‌ర్ మూవీ ఇది.

చ‌డీచ‌ప్పుడు లేకుండా మూణ్నాలుగేళ్ల కింద‌టే ఈ సినిమాను పూర్తి చేసిన వ‌ర్మ‌.. ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశాడు కానీ.. సినిమా విడుద‌ల సంగ‌తి తేల్చ‌లేదు. టైటిల్, ఫ‌స్ట్ లుక్, ఇత‌ర ప్రోమోలేవీ ప్రేక్ష‌కుల దృష్టిని ఏమాత్రం ఆక‌ర్షించ‌లేక‌పోయాయి. విడుద‌ల‌కు స‌న్నాహాలు జ‌రిగాయి కానీ.. సినిమాకు బిజినెస్ జ‌ర‌గ‌లేదు. త‌ర్వాత ఏం జ‌రిగిందో ఏమో ప‌ట్ట‌ప‌గ‌లు చిత్రాన్ని ప‌క్క‌న పెట్టేసి య‌ధావిధిగా వేరే ప్రాజెక్టు వైపు వెళ్లిపోయాడు వ‌ర్మ‌.

క‌ట్ చేస్తే ఇన్నేళ్ల త‌ర్వాత ఆ సినిమాను బ‌య‌టికి తీస్తున్నాడు వ‌ర్మ‌. ఇదేదో కొత్త సినిమా అనుకునేలా దానికి టైటిల్ మార్చేయ‌డం విశేషం. దెయ్యం అని పేరు పెట్టాడు. దెయ్యం పేరుతో వ‌ర్మ నుంచి ఇంత‌కుముందే ఓ సినిమా వ‌చ్చింది. కాబ‌ట్టి దెయ్యం ముంద‌ర ఆర్జీవీ అని తన పేరే చేర్చుకున్నాడు. బిగ్ బాస్ షోలో చేసిన సాక్షి దీక్షిత్ ఇందులో కీల‌క పాత్ర పోషించింది.

రాజ‌శేఖ‌ర్ ఈ సినిమా కోసం మేక‌ప్ లేకుండా న‌టించ‌డం విశేషం. ఇంత‌కుముందు రిలీజ్ చేసిన ప్రోమోలు చూస్తే ఇది దెయ్యం-చేత‌బ‌డుల చుట్టూ తిరిగే మామూలు హార్ర‌ర్ సినిమాలాగే క‌నిపించింది. వ‌ర్మ పాత సినిమాల‌నే త‌ల‌పించింది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఈ సినిమాను ప్రేక్ష‌కులు ఏమాత్రం ప‌ట్టించుకుంటార‌న్న‌ది సందేహ‌మే. ఐతే వ‌ర్మ మాత్రం ఈ నెల 16న తెలుగులో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేస్తానంటున్నాడు. మ‌రి ఎలాంటి ఫ‌లితం ద‌క్కుతుందో చూడాలి.