ధనుష్.. రజినీ అల్లుడెలా అయ్యాడు?

‘తుల్లువదో ఇలమై’ అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు తమిళ కథానాయకుడు ధనుష్. అందులో అతడి లుక్స్ చూసి ఎంతోమంది హేళన చేశారు. ఇతను హీరో ఏంటి అంటూ ప్రశ్నలు సంధించారు. అది ధనుష్ తండ్రి కస్తూరి రాజా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా. ఆ మూవీ హిట్టయినా సరే.. ధనుష్‌కు మాత్రం విమర్శలు తప్పలేదు. ఇలా కెరీర్‌ను ఆరంభించిన నటుడు.. పెద్ద స్టార్ అయిపోవడం.. రెండు జాతీయ అవార్డులు గెలిచే స్థాయికి ఎదగడం.. ఏకంగా సూపర్ స్టార్ అల్లుడు రజినీకాంత్ అల్లుడు కావడం అనూహ్యమైన విషయాలే.

ధనుష్ పెద్ద స్టార్ కావడానికి ముందే రజినీ కూతురికి అతను నచ్చేయడం.. వీరి పెళ్లికి చకచకా ఏర్పాట్లు జరిగిపోవడం కూడా విశేషమే. దీని వెనుక కథేంటో ఇప్పటిదాకా ధనుష్ ఎక్కడా ఓపెన్ అయింది లేదు. ఐతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ విశేషాలు పంచుకున్నాడు. ఆ కథేంటో అతడి మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

“తుల్లువదో ఇలమై సినిమాతో నేను చాలా విమర్శలు ఎదుర్కొన్నా. కానీ మా అన్నయ్య సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన నా రెండో సినిమా ‘కాదల్ కొండేన్’ నాకు చాలా మంచి పేరు తెచ్చింది. ఆ సినిమా చూసిన రజినీ గారి పెద్దమ్మాయి ఐశ్వర్య నాకో బొకే పంపింది. ‘గొప్పగా నటించారు. కంగ్రాట్స్. కీప్ ఇన్ టచ్’ అని అందులో మెసేజ్ కూడా పెట్టారు. ఆ తర్వాత ఒకసారి కాఫీ షాపులో కలిసి మాట్లాడుకున్నాం. అదెలా బయటికి వచ్చిందో కానీ.. మీడియా వాళ్లు మేం ప్రేమలో పడ్డట్లే రాసేశారు. ‘నా వల్ల సూపర్ స్టార్ కూతురికి చెడ్డ పేరు వచ్చిందే’ అని బాధపడిపోయాను. ఈలోపు పెద్దవాళ్లేమో వీళ్లిద్దరికీ పెళ్లి చేస్తే తప్పేంటి అనుకున్నారు. ఇరు వైపులా మాటలు జరిగాయి. అలా ఊహించని విధంగా మా పెళ్లి కుదిరింది. పెళ్లి మాటలు జరిగాక కూడా మేం పెద్దగా మాట్లాడుకుంది లేదు. అసలు నాతో పెళ్లికి ఐశ్వర్య ఒప్పుకుందన్న విషయం నేను నమ్మలేకపోయాను. చాలా త్వరగా మా పెళ్లి యఅిపోయింది. మేం తొలిసారి కలుసుకున్న ఆరు నెలల్లోనే దంపతులయ్యాం’’ అని ధనుష్ వెల్లడించాడు.