ఎటు చూసినా తమన్ తమన్..

తమన్.. తమన్.. తమన్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. ఇండియాలోనే ఇలాంటి ఫామ్‌లో మరే సంగీత దర్శకుడూ లేదంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు రొటీన్, ఊకదంపుడు మ్యూజిక్ ఇస్తాడని.. కాపీ కొడతాడని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కొనేవాడు తమన్. కానీ గత కొన్నేళ్లలో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుని అద్భుతమైన ఆడియోలతో అదరగొట్టిన తమన్.. గతంలో తెగిడిన నోళ్లతోనే పొగడ్తలు అందుకుంటున్నాడు.

సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా తమన్ సంగీతం గురించే చర్చ జరుగుతోంది. ఎటు చూసినా అందరూ పాజిటివ్‌గానే మాట్లాడుతున్నారు. ఏప్రిల్ నెలలో తమన్ ఆధిపత్యం మామూలుగా లేదు. సౌత్ ఇండియా అంతటా అతడి పేరు మార్మోగేలా కనిపిస్తోంది.

గత వారం విడుదలైన రెండు చిత్రాలకు తమన్ సంగీతం అందించాడు. కన్నడ, తెలుగు భాషల్లో విడుదలైన పునీత్ రాజ్‌కుమార్ సినిమా ‘యువరత్న’కు తమన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకున్నాయి. సినిమాకు అవి పెద్ద ప్లస్ అయ్యాయి. ఒక కమర్షియల్ సినిమాకు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే మ్యూజిక్ ఇచ్చాడతను. ఇక దీంతో పాటే తెలుగులో రిలీజైన ‘వైల్డ్ డాగ్’కు తమన్ అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ అందించి ప్రశంసలు అందుకున్నాడు. ఆ సినిమాలోనూ మేజర్ హైలైట్లలో స్కోర్ ఒకటి. ఇక ఈ వారం ‘వకీల్ సాబ్’తో తమన్ మోత మోగించేసేలాగే ఉన్నాడు.

ఇప్పటికే ప్రోమోల్లో అతడి మ్యూజిక్ హైలైట్ అయింది. పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఆర్ఆర్ గురించి కూడా పెద్ద చర్చే నడుస్తోంది. తొలిసారి పవన్ సినిమాకు సంగీతాన్నందించిన అతను.. బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చినట్లే ఉన్నాడు. రేప్పొద్దున సినిమాలో పవన్ ఎలివేషన్ సీన్లకు తమన్ ఇచ్చిన స్కోర్‌తో థియేటర్లు హోరెత్తిపోతాయని అంచనా వేస్తున్నారు. రెండు వారాల పాటు ‘వకీల్ సాబ్’ హంగామా నడవడం, తమన్ పేరు మార్మోగడం ఖాయం.

ఆ తర్వాత తమన్ మ్యూజిక్ అందించిన మరో సినిమా ‘టక్ జగదీష్’ వస్తుంది. ఈ సినిమాలోనూ పాటలు అదిరిపోయాయనే టాక్ వచ్చింది. ఆర్ఆర్ గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఏప్రిల్ చివరి వారమంతా ఈ సినిమాతో తమన్ పేరు చర్చనీయాంశం కావడం ఖాయం. ఇలా ఏప్రిల్ నెలంతా తమన్ పేరు హోరెత్తిపోయేలాగే ఉంది.