నారప్ప టీంతో మ‌ణిశ‌ర్మ‌కు గొడ‌వ‌?

టాలీవుడ్లో వివాద ర‌హిత టెక్నీషియ‌న్‌గా మ‌ణిశ‌ర్మ‌కు మంచి పేరుంది. ఆయ‌న ఎప్పుడూ పెద్ద‌గా వివాదాల్లో జోక్యం చేసుకున్న‌ట్లు వార్త‌లు రాలేదు. సైలెంటుగా త‌న ప‌ని తాను చేసుకుపోతుంటాడు. కాక‌పోతే ద‌ర్శ‌కుల‌తో మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌కు క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ మామూలే. అలాంటి విద్వ‌త్తున్న సంగీత ద‌ర్శ‌కుడికి కొన్నిసార్లు.. ద‌ర్శ‌కుల‌తో వేవ్ లెంగ్త్ కుద‌ర‌క చిన్న చిన్న గొడ‌వ‌లు జ‌రిగి ఉండొచ్చు. కానీ అవేవీ బ‌య‌టికి రాలేదు. కానీ ఇప్పుడు మ‌ణిశ‌ర్మ‌కు ఓ ద‌ర్శ‌కుడితో వివాదం త‌లెత్తి ఆ ప్రాజెక్టు నుంచే బ‌య‌టికి వ‌చ్చేసిన‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఆ ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ అడ్డాల కాగా.. వీళ్లిద్ద‌రి మ‌ధ్య విభేదాల‌కు కార‌ణ‌మైన సినిమా నార‌ప్ప అట‌. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. నార‌ప్ప సినిమాకు సంగీతం అందించే విష‌యంలో త‌న‌కు స్వేచ్ఛ ఇవ్వ‌డం లేదంటూ మ‌ణిశ‌ర్మ అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. ఆ ఇంట‌ర్వ్యూ యూట్యూబ్‌లో హ‌ల్‌చ‌ల్ చేసింది. కానీ ఇటీవ‌ల శ్రీకాంత్‌తో మ‌ణిశ‌ర్మ‌కు విభేదాలు తీవ్ర‌మ‌య్యాయ‌ని.. ఆయ‌న ఈ ప్రాజెక్టు నుంచి వాకౌట్ చేసే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని అంటున్నారు. దీని గురించి సోష‌ల్ మీడియాలో రూమ‌ర్లు కూడా వినిపిస్తున్నాయి.

కానీ ఇంకా ప‌క్కాగా స‌మాచారం అయితే బ‌యటికి రాలేదు. ఇలాంటి పేరున్న సినిమా నుంచి ఈ ద‌శ‌లో సంగీత ద‌ర్శ‌కుడు బ‌య‌టికి వ‌చ్చేస్తే ఇది ఇరు వ‌ర్గాల‌కూ మంచిది కాదు. మ‌ళ్లీ టాప్ ఫామ్ అందుకుని వ‌రుస‌గా పెద్ద సినిమాలు చేస్తున్న ద‌శ‌లో మ‌ణిశ‌ర్మకు ఇది చెడే చేస్తుంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లాంటి పెద్ద బేనర్ తీస్తున్న సినిమా నుంచి సంగీత ద‌ర్శ‌కుడు బ‌య‌టికి వెళ్లిపోతే వారికీ ఇబ్బందిక‌ర‌మే. కాబ‌ట్టి ఇరు వ‌ర్గాలూ స‌ర్దుకుని మ‌ణిశ‌ర్మ ఈ సినిమాలో కొన‌సాగేలా చూస్తే మంచిదేమో.