జాతిరత్నాలు.. జాతిరత్నాలు.. ఇప్పుడు టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లాంటి చిన్న స్థాయి నటులను పెట్టి ‘పిట్టగోడ’ లాంటి ఫ్లాప్ సినిమా తీసిన అనుదీప్ కేవీ రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు రేపుతోంది. రిలీజ్ ముంగిట అనూహ్యమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రానికి మంచి టాక్ కూడా రావడంతో వీకెండ్లో దున్నేసుకుంది.
తొలి రోజే వరల్డ్ వైడ్ దాదాపు ఐదు కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించిన ఈ చిన్న సినిమా.. ఆ తర్వాత మూడు రోజుల్లోనూ ఏమాత్రం తగ్గలేదు. ప్రతి రోజు అటు ఇటుగా రూ.5 కోట్ల మేర షేర్ రాబట్టింది. వీకెండ్ అయ్యేసరికి రూ.20 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ షేర్‌తో అబ్బురపరిచింది. ఈ సినిమా స్థాయికి నాలుగు రోజుల్లో రూ.20 కోట్ల షేర్ అంటే అసాధారణ విషయమే.
రవితేజ, నాని, రామ్, నాగచైతన్య, విజయ్ దేవరకొండ లాంటి మీడియం రేంజ్ స్టార్ల సినిమాలకు మంచి టాక్ వస్తే తప్ప ఈ స్థాయి వసూళ్లు రావు. ‘జాతిరత్నాలు’ వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు రూ.11 కోట్లు పలికాయి. అదే చాలా ఎక్కువ రేటు అనుకున్నారు. కానీ మూడో రోజుకే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయి, లాభాల బాట పట్టింది. ఆదివారం భారీ వసూళ్లతో బయ్యర్లకు లాభాలు పంచింది. ఒక్క నైజాం ఏరియాలోనే ఈ సినిమా ఏడున్నర కోట్ల దాకా షేర్ రాబట్టడం విశేషం.
ఏపీలో సైతం ఈ చిత్రానికి అనూహ్యమైన వసూళ్లు వస్తున్నాయి. ఓవర్సీస్లో అయితే స్తబ్దుగా ఉన్న మార్కెట్‌కు మంచి జోష్ ఇచ్చింది ‘జాతిరత్నాలు’. వీకెండ్లో ఏకంగా 7 లక్షల డాలర్లకు పైగా కొల్లగొట్టి పోస్ట్ కరోనా ఎరాలో తొలి మిలియన్ డాలర్ ఇండియన్ మూవీ అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. వీకెండ్ తర్వాత కూడా ‘జాతిరత్నాలు’కు మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తుండటం విశేషం.