నిర్మాత‌ ల ద‌గ్గ‌ర కూడా టికెట్లు లేవట‌

రిలీజ్ ముంగిట అనూహ్య‌మైన క్రేజ్ సంపాదించుకుని, అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు చూపించిన జాతిర‌త్నాలు చిత్రం.. రిలీజ్ త‌ర్వాత కూడా జోరు కొన‌సాగిస్తోంది. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే మంచి టాక్ రావ‌డంతో ఈ సినిమాకు బాక్సాఫీస్ ద‌గ్గర ఎదురే లేక‌పోయింది. ట్రేడ్ పండిట్ల అంచ‌నాల‌ను కూడా మించి పోతూ తొలి రోజు నుంచి ఈ చిత్రం ఎలా వ‌సూళ్ల మోత మోగిస్తోందో తెలిసిందే.

మామూలుగా ఎంత మంచి టాక్ తెచ్చుకున్న సినిమాకైనా తొలి రోజు త‌ర్వాత కొంచెం వ‌సూళ్లు త‌గ్గుతుంటాయి. కానీ జాతిర‌త్నాలు వ‌సూళ్లు మాత్రం.. అస‌లు త‌గ్గ‌ట్లేదు. తొలి రోజుకు దీటుగా త‌ర్వాతి రోజుల్లో క‌లెక్ష‌న్లు వ‌స్తున్నాయి. వీకెండ్ అంతా ఈ సినిమా హౌస్ ఫుల్స్‌తో న‌డిచింది. ఆదివారం అయితే ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డా టికెట్లు దొరికే ప‌రిస్థితి లేదు. అన్ని చోట్లా ప్యాక్డ్ హౌసెస్‌తో న‌డిచిందీ చిత్రం.

ఈ సినిమా టికెట్ల దొర‌క్క.. థియేట‌ర్ల‌కు వ‌చ్చిన జ‌నాలు వేరే సినిమాల‌కు వెళ్లే ప‌రిస్థితి క‌నిపించింది. అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లోనూ ఓవ‌ర్ ఫ్లోస్ క‌నిపించాయి ఈ చిత్రానికి. ఈ నేప‌థ్యంలో హౌస్ ఫుల్ బోర్డుల‌ను సూచిస్తూ జాతిర‌త్నాలు చిత్ర బృందం ఒక ఆస‌క్తిక‌ర పోస్ట‌ర్ వ‌దిలింది.

చింత‌కాయ ర‌సం.. మా ప్రేక్ష‌కులు ఆసం అంటూ ఒక ఫ‌న్నీ క్యాప్ష‌న్‌తో పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. దీన్ని స్వ‌ప్న సినిమా ట్విట్ట‌ర్ హ్యాండిల్లో పెట్టి.. నిజంగా చెప్పాలంటే మా ద‌గ్గ‌ర కూడా టికెట్లు లేవు అంటూ ఈ పోస్ట‌ర్‌కు రైట‌ప్ జోడించారు. మామూలుగా పెద్ద సినిమాల‌కే టికెట్ల కోసం ఆయా చిత్ర యూనిట్ల‌కు ఫోన్లు వ‌స్తుంటాయి. రెక‌మండేష‌న్లు న‌డుస్తుంటాయి. కానీ జాతిర‌త్నాలు లాంటి చిన్న సినిమాకు అదే స్థాయిలో డిమాండ్ క‌నిపిస్తుండ‌టం.. త‌మ ద‌గ్గ‌ర కూడా టికెట్లు లేవంటూ నిర్మాణ సంస్థ ట్విట్ట‌ర్లో కామెంట్ పెట్ట‌డం చిత్ర‌మే.