కృష్ణవంశీని నమ్మేదెవరు?

‘అన్నం’ పేరుతో కొత్త సినిమా పోస్టర్ వదిలి అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ. ఆయన్నుంచి ఇది ఊహించని ప్రాజెక్టే. ఈ దశలో ఇలా అనౌన్స్‌మెంట్ ఉంటుందని కూడా ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే కృష్ణవంశీ కొత్త సినిమా ‘రంగమార్తాండ’ రిలీజై దాని ఫలితమేంటో తెలిశాక కానీ.. ఆయన కొత్త చిత్రం సంగతి తేలదనే అనుకున్నారంతా. కానీ ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఇంతలోపే కొత్త సినిమాను ప్రకటించాడు. కానీ దాని కాస్ట్ అండ్ క్రూ సంగతేమీ తేల్చలేదు. నిర్మాత కూడా ఖరారైనట్లుగా కనిపించట్లేదు.

కాన్సెప్ట్ పోస్టర్‌తో ముందు క్యూరియాసిటీ పెంచి.. ఆ తర్వాత ఎవరో ఒక ప్రముఖ కథానాయకుడిని మెప్పించి పెద్ద స్థాయిలో ఈ సినిమా తీయాలని కృష్ణవంశీ భావిస్తున్నాడట. మెగాస్టార్ చిరంజీవి చేసినా ఈ సినిమా బాగుంటుందని ఆయన భావిస్తున్నారట. ఆయన కుదరకపోతే ఇంకెవరైనా స్టార్ హీరో అయితేనే దీనికి న్యాయం చేయగలడని అనుకుంటున్నారట.

కానీ ఈ దశలో కృష్ణవంశీని నమ్మి ‘అన్నం’ సినిమా చేసే స్టార్ హీరో ఎవరన్నది ప్రశ్న. ఒకప్పుడు తన వెంట స్టార్లు పడుతున్నా పట్టించుకోకుండా.. తనకు నచ్చిన నటులతో సినిమాలు చేసుకుపోయారు కృష్ణవంశీ. మెగాస్టార్ అంతటి వాడు కృష్ణవంశీతో సినిమా చేయాలని ఆశపడితే.. అతను సరిగా స్పందించలేదు. తన యారొగెన్స్ వల్ల చిరుతో సినిమా చేసే అవకాశాన్ని కోల్పోయానని తర్వాత ఓ సందర్భంలో కృష్ణవంశీ చెప్పడమూ తెలిసిందే. ఇక వర్తమానం విషయానికి వస్తే.. కృష్ణవంశీ తన ఫామ్ కోల్పోయి చాలా ఏళ్లయింది. ‘చందమామ’ ఆయన చివరి హిట్టు. నిజానికి అది కూడా పూర్తిగా ఏమీ ప్రేక్షకులను మెప్పించలేదు.

ఒకప్పుడు సరి కొత్త కథలతో, సినిమా సినిమాకూ వైవిధ్యంతో ఆశ్చర్యపరిచిన కృష్ణవంశీ.. ఒక దశ దాటాక ఒక టైపు ఫ్యామిలీ సినిమాల మూసలో చిక్కుకుపోయాడు. ఈ క్రమంలోనే ‘మొగుడు’ లాంటి భరించలేని సినిమా వచ్చింది ఆయన్నుంచి. దాన్నుంచి బయటికి వచ్చి ‘నక్షత్రం’ చేస్తే అది మరీ దారుణమైన ఫలితాన్నందుకుంది.
ఇప్పుడు చేస్తున్న ‘రంగమార్తాండ’ ఆయన సొంత కథ కాదు. రీమేక్. దీనికి అసలు బజ్ కనిపించడం లేదు. ఈ సినిమా నుంచి ఇంకా ఏ అప్‌డేట్ బయటికి రాలేదు. సినిమా రిలీజై మంచి ఫలితాన్నందుకున్నా.. రీమేక్ కాబట్టి కృష్ణవంశీకి ఏమాత్రం క్రెడిట్ దక్కుతుందన్నది సందేహమే. అలాంటిది ఇంకా ‘రంగమార్తాండ’ రిలీజ్ కాకముందే కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేసి దానికి స్టార్ హీరో కావాలని కృష్ణవంశీ ఆశించడం చిత్రంగానే ఉంది. మరి ఆయన్ని నమ్మి ముందుకొచ్చేదెవరో?