కొత్త సినిమాలు తుస్.. పాత‌దే బెస్ట్

ఉప్పెన సినిమాతో ఇప్ప‌టికే చిత్ర నిర్మాత‌లపై క‌న‌క వ‌ర్షం కురిసింది. ఈ సినిమా వాళ్లు ఆశించిన‌దానికంటే చాలా ఎక్కువ ఆదాయాన్నే అందించింది. ఈ రోజుల్లో కొత్త సినిమా రెండో వారాంతం వ‌ర‌కు నిల‌బ‌డితే చాల‌నుకుంటారు. కానీ ఈ చిత్రం మూడో వీకెండ్లో సైతం మంచి షేర్ రాబ‌ట్టింది. బాక్సాఫీస్ లీడ‌ర్‌గా నిలిచింది. కొత్త సినిమాలు వ‌స్తున్నాయి. వెళ్తున్నాయి. కానీ ఉప్పెన జోరు మాత్రం త‌గ్గ‌ట్లేదు.

ఫిబ్ర‌వ‌రి 12న‌ ఉప్పెన‌కు పోటీగా విడుద‌లైన ఎఫ్‌.సి.యు.కె క‌నీస స్థాయిలో కూడా ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. త‌ర్వాతి వారం విడుద‌లైన వాటిలో నాంది మాత్ర‌మే నిల‌బ‌డింది. అది కూడా ఉప్పెన‌ను పెద్ద‌గా దెబ్బ తీయ‌లేక‌పోయింది. క‌ప‌ట‌ధారి, చ‌క్ర అడ్ర‌స్ లేకుండా పోయాయి. గ‌త‌ వారం నితిన్-చంద్ర‌శేఖ‌ర్ యేలేటిల సినిమా చెక్‌కు మంచి బ‌జ్ క‌నిపించింది. ఈ సినిమా క‌చ్చితంగా ఉప్పెన‌కు బ్రేక్ వేస్తుంద‌ని అంచ‌నా వేశారు ట్రేడ్ పండిట్లు. కానీ అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు.

చెక్ తొలి రోజు మాత్ర‌మే కొంత జోరు చూపించింది. ఉప్పెన వ‌సూళ్ల‌పై ప్ర‌భావం చూపించింది. కానీ రెండో రోజు నుంచి మామూలే. శ‌ని, ఆదివారాల్లో ఉప్పెన సినిమాకు మంచి వ‌సూళ్లు వ‌చ్చాయి. గ‌త వారాంతంలో వ‌చ్చిన అక్ష‌ర పెద్ద‌గా ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించ‌లేక‌పోయింది. వీకెండ్ అవ్వ‌గానే ఆ సినిమా అడ్ర‌స్ గ‌ల్లంత‌యింది.


సోమ‌వారం హైద‌రాబాద్‌ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఫుల్ డే క‌లెక్ష‌న్లు చూస్తే.. ఉప్పెన రూ.82 వేల దాకా ఉండ‌గా.. నాందికి 49 వేలు, చెక్‌కు 49 వేలు వ‌చ్చాయి. దీన్ని బ‌ట్టే ఉప్పెన ఇప్ప‌టికే ఎలా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షిస్తోందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఈ వారాంతంలో వ‌చ్చే ఎ1 ఎక్స్‌ప్రెస్, ప‌వ‌ర్ ప్లే సినిమాలైనా ఉప్పెన జోరుకు క‌ళ్లెం వేస్తాయా లేక మ‌హాశివ‌రాత్రి సినిమాల‌కు ఆ బాధ్య‌త‌ను విడిచిపెడ‌తాయా అన్న‌ది చూడాలి. ఉప్పెన దాదాపు రూ.50 కోట్ల వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ సాధించ‌డం విశేషం.