104 డిగ్రీల జ్వరంతో చిరు డ్యాన్స్

తన సినిమాలకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి కమిట్మెంట్ ఎలాంటిదో దర్శక నిర్మాతలు.. సహచర నటీనటులు కథలు కథలుగా చెబుతుంటారు. చిరు కెరీర్లో మైల్ స్టోన్ మూవీగా నిలిచిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా విషయంలోనూ చిరు అంతే కమిట్మెంట్ చూపించారట.

ఈ సినిమా విడుదలై ఈ నెల 9కి 30 ఏళ్లు పూర్తి కాబోతున్న నేపథ్యంలో నేచురల్ స్టార్ నాని సినిమా మేకింగ్ విశేషాల్ని పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రెండో వీడియోలో ఓ ఆసక్తికర విశేషం బయటపెట్టాడు నాని.

‘దినక్కుతా దినక్కురో’ పాటలో చిరు డ్యాన్సుల్లో ఎంత ఎనర్జీ చూపించాడో తెలిసిందే. ఐతే ఆ పాట చిత్రీకరిస్తున్న సమయంలో చిరు 104 డిగ్రీల జ్వరంతో బాధ పడుతున్నాడట. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో షూటింగ్ కొనసాగించారట.

ఈ పాట కోసం వాహినీ స్టూడియోలో భారీ సెట్ వేశారని.. ఐతే సాధ్యమైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసుకుని శ్రీదేవి ఓ హిందీ సినిమా చిత్రీకరణ కోసం వెళ్లాల్సి ఉందని.. ఆమె వెళ్లిపోతే మళ్లీ డేట్లు దొరకవని.. రిలీజ్ డేట్ అప్పటికే ప్రకటించిన నేపథ్యంలో చాలా ఇబ్బంది అవుతుందని.. దీంతో చిరు 104 డిగ్రీల జ్వరంతో బాధ పడుతున్నప్పటికీ చిత్రీకరణ ఆపే పరిస్థితి లేకపోయిందని వెల్లడించాడు నాని.

సెట్లో డాక్టర్‌ను పెట్టుకుని చిరు షూటింగులో పాల్గొన్నాడట. చిరు కమిట్మెంట్ వల్లే అనుకున్న ప్రకారం మే 9న రిలీజ్ చేయగలిగినట్లు అశ్వినీదత్ తెలిపారు. ఇక సినిమా కోసం ఇళయరాజా అందించిన ట్యూన్లన్నీ మెలోడీల్లాగే ఉండటంతో మాస్ పాట లేదని చిరు అన్నాడని.. ఐతే ‘అబ్బనీ తీయని..’ మంచి మాస్ పాట అయ్యేలా లిరిక్స్ రాస్తానని చెప్పిన వేటూరి మాట నిలబెట్టుకున్నారని.. ఈ పాటను మైసూరులో రెండే రోజుల్లో రాఘవేంద్రరావు అద్భుతంగా చిత్రీకరించారని.. ‘అందాలలో మహోదయం’ పాట కోసం మాత్రం 11 రోజులు పట్టిందని ఈ వీడియోలోనే వివరించాడు నాని.