సూపర్ స్టార్ రజినీకాంత్ రెండు నెలల నుంచి ఇంటికే పరిమితం అయి ఉన్నాడు. కరోనా-లాక్ డౌన్ టైంలోనూ ఆయన ఆరు నెలలకు పైగా ఇంట్లోనే ఉన్నారు. బయటికే రాలేదు. కానీ అప్పుడు దాని గురించి పెద్ద చర్చ లేదు. అప్పుడు రజినీ మాత్రమే కాదు.. చాలామంది సెలబ్రెటీలు, ముఖ్యంగా వయసు మళ్లిన వాళ్లు ఇళ్లు దాటి బయటికి రాలేదు.
ఐతే కరోనా బ్రేక్ తర్వాత రజినీకాంత్ అభిమానులను కలవడం, రాజకీయ పార్టీ పెట్టడంపై చర్చించడం, త్వరలోనే పార్టీ మొదలవుతుందని ప్రకటించడం.. ఈలోపు ‘అన్నాత్తె’ షూటింగ్ పూర్తి చేద్దామని రంగంలోకి దిగడం, కానీ యూనిట్లో కొందరు కరోనా బారిన పడటంతో రజినీ కంగారు పడిపోవడం, అన్నింటికంటే తన ఆరోగ్యం ముఖ్యమన్న భావనతో రాజకీయాలకు దూరమవుతున్నట్లు ప్రకటించడం, తిరిగి ఇంటికి పరిమితం కావడం, అభిమానుల ఆగ్రహాన్ని చవిచూడటం తెలిసిన సంగతులే. కరోనా ప్రభావం చాలా వరకు తగ్గినా కూడా తాను రాజకీయాల్లోకి రాబోనన్న ప్రకటనతో ఆగ్రహంతో ఉన్న అభిమానులకు భయపడే రజినీ బయటికి రావట్లేదని భావించారు.
ఐతే దీపావళికి ‘అన్నాత్తె’ రిలీజ్ అని ప్రకటించేసిన నేపథ్యంలో రజినీ ఇంకెన్నో రోజులు ఇంటికి పరిమితం అయ్యే పరిస్థితి లేదు. అందుకే ఆయన బయటికి రావాలని నిర్ణయించుకున్నారు. నేరుగా షూటింగ్‌కు వెళ్లకుండా, అలాగని అభిమానులను నేరుగా కలవకుండా వారికి తన దర్శనం కల్పించాలని అనుకున్నారు. ఇందుకు ఇళయరాజా కొత్త స్టూడియో ఆరంభం ఆయనకు ఉపయోగపడింది. చెన్నైలో ఇన్నాళ్లూ రికార్డింగ్స్ జరుపుకున్న స్టూడియో యాజమాన్యంతో గొడవ నేపథ్యంలో ఇళయరాజా.. ఆ వివాదానికి తెరదించుతూ కొత్తగా స్టూడియో కట్టుకున్నారు. దాన్ని ఇటీవలే ఆరంభించారు. దాని గురించి రజినీకి కూడా సమాచారం ఇచ్చారు. ఆ స్టూడియో చూసేందుకు రజినీ వచ్చారు.
కరోనా జాగ్రత్తలు మరిచిపోకుండా మాస్క్ ధరించి ఆయన ఇళయరాజా స్టూడియోలో అడుగు పెట్టారు. స్టూడియో అంతా కలియ తిరిగారు. ఇసై జ్ఞాని పాటల రికార్డింగ్‌ను దగ్గరుండి చూశారు. సంబంధిత ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాకు చేరేలా చూసినట్లున్నారు రజినీ. రాజకీయం విషయమై నిరాశతో ఉన్నప్పటికీ రజినీ మళ్లీ ఇలా కనిపించడం మెజారిటీ అభిమానులను సంతోషపరుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates