లాక్ డౌన్ టైంలో కొత్త సినిమాలు నేరుగా ఓటీటీల్లో విడుదలవడం చూశాం. థియేటర్లు మళ్లీ తెరుచుకున్నాక కూడా కొన్ని సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. థియేటర్లలో విడుదలైన సినిమాలు కూడా మరీ గ్యాప్ ఏమీ తీసుకోకుండా ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి.
సంక్రాంతి సినిమాల్లో ఇప్పటికే మూడు ఓటీటీల్లోకి అందుబాటులోకి వచ్చేశాయి. మాస్టర్ విడుదలైన రెండు వారాలకే ప్రైమ్‌లో రిలీజ్ కాగా.. తర్వాతి వారంలో క్రాక్ ఆహాలో, అల్లుడు అదుర్స్ సన్ నెక్స్ట్లో రిలీజయ్యాయి. ఇక చివరి సంక్రాంతి సినిమా రెడ్ కూడా త్వరలోనే ఓటీటీలోకి వచ్చేయనుంది. ఆ చిత్రం ఫిబ్రవరి 22న నెట్ ఫ్లిక్స్‌లో, 23న సన్ నెక్స్ట్లో రిలీజ్ కానుంది.
ఈ రెండు ఓటీటీల మధ్య ఒప్పందం సంగతి తెలిసిందే. అల వైకుంఠపురములో సహా కొన్ని చిత్రాలనూ ఈ రెండు ఓటీటీలూ పంచుకున్నాయి. రెడ్ కూడా ఇదే కోవలో రెండు ఓటీటీల్లో ఒక్క రోజు వ్యవధిలో విడుదల కానుంది.
ఇక సంక్రాంతి తర్వాత రిలీజైన చిత్రాల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది ఉప్పెననే. అంచనాల్ని మించిపోయి థియేటర్లలో ఇరగాడేస్తున్న ఈ చిత్రానికి డిజిటల్ డీల్ ఎప్పుడో పూర్తయింది. నెట్ ఫ్లిక్స్ వాళ్లు హక్కులు తీసుకున్నారు. సినిమా టైటిల్స్‌లోనూ కమింగ్ సూన్ అంటూ నెట్ ఫ్లిక్స్ వాళ్ల ప్రకటన కనిపించింది. ఐతే ఈ చిత్రాన్ని అంత తొందరగా అయితే డిజిటల్లో రిలీజ్ చేయట్లేదు. థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజయ్యేలా ఒప్పందం కుదిరిందట. ఏప్రిల్ తొలి వారంలో ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్‌లోకి దిగుతుందట.
నిజానికి గత ఏడాది ఏప్రిల్ తొలి వారంలో విడుదల కావాల్సిన చిత్రమిది. కానీ కరోనా కారణంగా ఆలస్యమై ఫిబ్రవరి 12న థియేటర్లలోకి వచ్చింది. ఇంకో నెలన్నర తర్వాత ఓటీటీ బాట పట్టనుంది. ఈలోపు థియేటర్ల నుంచి సంచలన వసూళ్లు రాబడుతోందీ చిత్రం. ఫుల్ రన్లో ఉప్పెన రూ.50 కోట్ల షేర్ సాధించే సూచనలు కనిపిస్తున్నాయి.