ఉప్పెన ప్రి రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ చాలా ఉద్వేగంగానే మాట్లాడాడు. తన శిష్యుడు బుచ్చిబాబు సానా చాలా గొప్ప సినిమా తీశాడని.. ఈ కథ విన్నపుడే తాను చాలా ఎగ్జైట్ అయ్యానని చెప్పాడు. ఈ కథ చాలా గొప్పది కాబట్టే స్వయంగా చెన్నైకి వెళ్లి రాయణం పాత్రకు విజయ్ సేతుపతిని పట్టుబట్టి ఒప్పించానన్నాడు. అంతే కాదు.. ఈ కథ విన్న వెంటనే మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన రవిశంకర్‌కు ఫోన్ చేసి ఇది వంద కోట్ల సినిమా అవుతుందని అన్నట్లు చెప్పాడు.
ఈ మాటను సుక్కు కొంచెం నొక్కి వక్కాణించడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. శిష్యుడు సినిమాను సేల్ చేయడానికి సుక్కు గట్టిగా ప్రయత్నిస్తున్నాడని.. కొత్త హీరో హీరోయిన్లతో ఓ కొత్త దర్శకుడు తీసిన ఉప్పెనను వంద కోట్ల సినిమాగా పేర్కొనడం ఏంటి అనుకున్నారు. కానీ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఉప్పెన జోరు చూస్తుంటే అప్పుడు అతిశయోక్తిలా అనిపించిన మాటే నిజమవుతుందేమో అనిపిస్తోంది.
మూడు రోజులు తిరిగేసరికే ఉప్పెన ఏకంగా రూ.50 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసేసింది. షేర్ రూ.28 కోట్లను దాటిపోయింది. ఇంకో రెండు వారాలు ఈ సినిమా జోరు కొనసాగేలా కనిపిస్తోంది. వీకెండ్ అయ్యాక సోమవారం కూడా ఉప్పెన బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడింది. కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. వచ్చే రెండు మూడు వారాంతాల్లోనూ ఇతర సినిమాల పోటీని తట్టుకుని ఉప్పెన నిలబడుతుందనే అంచనా వేస్తున్నారు. థియేట్రికల్ రన్ ద్వారా ఈ చిత్రం రూ.80 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
ఇక ఈ చిత్ర డిజిటల్ హక్కులకూ మంచి రేటే పలికినట్లు చెబుతున్నారు. ఇంకా శాటిలైట్ హక్కులు అమ్మాల్సి ఉంది. రీమేక్, డబ్బింగ్ హక్కుల కోసమూ మంచి ఆఫర్లు వచ్చే అవకాశముంది. ఇలా అన్ని మార్గాల్లో కలిపి మొత్తంగా ఉప్పెన రూ.100 కోట్లు రాబట్టినా రాబట్టి సుకుమార్ మాటను నిజం చేసినా చేయొచ్చేమో.