మారుతికి డేట్లివ్వని తమన్


కెరీర్ ఆరంభంలో తన సినిమాల స్థాయికి తగ్గట్లే చిన్న సంగీత దర్శకులు, ఛాయాగ్రాహకులతో పని చేసిన యువ దర్శకుడు మారుతి.. ‘భలే భలే మగాడివోయ్’ దగ్గర్నుంచి కొంచెం పెద్ద రేంజి టెక్నీషియన్లతోనే పని చేస్తున్నాడు. మలయాళ సంగీత దర్శకుడు గోపీ సుందర్‌తో ‘భలే భలే..’, ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రాలకు మంచి సంగీతం చేయించుకున్న మారుతి.. తన చివరి రెండు సినిమాలకు తమన్‌ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. వీరి కాంబినేషన్ భలేగా కుదిరి ఈ రెండు చిత్రాలకూ మంచి పాటలు, నేపథ్య సంగీతం వచ్చాయి.

ముఖ్యంగా తమన్‌కు ‘మహానుభావుడు’ ఒక మేకోవర్ అయింది. ఈ సినిమా నుంచే క్లాస్ పాటలతో అతను ఒక ఊపు ఊపడం మొదలైంది. ‘ప్రతి రోజూ..’కు ఆ స్థాయిలో కాకపోయినా మంచి మ్యూజిక్కే ఇచ్చాడు. వీరి కలయికలో హ్యాట్రిక్ మూవీ కోసం అందరూ చూస్తుంటే.. మారుతి వేరే సంగీత దర్శకుడిని తన తర్వాతి చిత్రానికి ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

యాక్షన్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో మారుతి ‘పక్కా కమర్షియల్’ అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మలయాళ కుర్రాడు జేక్స్ బిజోయ్ ఖరారయ్యాడు. తమన్‌ను మారుతి ఎందుకు వదిలేశాడబ్బా అన్న సందేహాలు కలిగాయి అందరిలో.

ఐతే ఈ చిత్రానికి కూడా తమన్‌తోనే మ్యూజిక్ చేయించాలని మారుతి అనుకున్నప్పటికీ.. అతడికి డేట్లిచ్చే పరిస్థితుల్లో తమన్ లేడట. వకీల్ సాబ్, సర్కారు వారి పాట, బాలయ్య-బోయపాటి సినిమా సహా తమన్ చేతిలో భారీ చిత్రాలు చాలానే ఉన్నాయి. వాటిని సమయానికి పూర్తి చేయడమే కష్టంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అక్టోబరు 1కి రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న ‘పక్కా కమర్షియల్’కు పని చేయడం కష్టమని భావించి తమన్.. మారుతికి సారీ చెప్పాడట. దీంతో బిజోయ్‌ను మారుతి ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అతను ఇంకతుముందు తెలుగులో ‘ట్యాక్సీవాలా’తో సత్తా చాటాడు. మలయాళంలో ‘అయ్యప్పనుం కోషీయుం’ సహా కొన్ని పెద్ద చిత్రాలకు పని చేసిన అనుభవం అతడికుంది. తమిళంలో అతను కొన్ని సినిమాలు చేశాడు.