చిరంజీవి కాల్.. జీవితంలో ది బెస్ట్


మెగాస్టార్ చిరంజీవి ప్ర‌శంస‌ల్ని ఒక అవార్డు లాగా భావిస్తారు యువ న‌టీన‌టులు, టెక్నీషియ‌న్లు. ఇందుకు తాను కూడా మిన‌హాయింపు కాదంటోంది త‌మిళ అమ్మాయి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్. త‌మిళంలో క‌థానాయిక‌గా అరంగేట్రం చేసి, ఆ త‌ర్వాత నెగెటివ్, క్యారెక్ట‌ర్ రోల్స్‌కు మారిన ఈ భామ‌.. ఈ మ‌ధ్య తెలుగులోనూ త‌ర‌చుగా సినిమాలు చేస్తోంది.

సందీప్ కిష‌న్ సినిమా తెనాలి రామ‌కృష్ణ‌తో తెలుగులో విల‌న్‌గా ఎంట్రీ ఇచ్చిన వ‌ర‌ల‌క్ష్మి ఇటీవ‌ల క్రాక్ సినిమాలో జ‌య‌మ్మ‌గా బ‌ల‌మైన ముద్రే వేసింది. ఆ పాత్ర ఆమెకు మంచి పేరే తీసుకొచ్చింది. ఈ పాత్ర‌కు వేరే న‌టిని ఊహించుకోలేని స్థాయిలో పెర్ఫామ్ చేసింది వ‌ర‌ల‌క్ష్మి. ఈ పాత్ర‌కు వ‌చ్చిన స్పంద‌న‌, ప్ర‌శంస‌లు త‌న‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచాయ‌ని, ముఖ్యంగా చిరంజీవి ఫోన్ చేసి మ‌రీ అభినందించిన తీరును ఎప్ప‌టికీ మ‌రిచిపోలేన‌ని ఆమె చెప్పింది.

ఇటీవ‌ల త‌న తండ్రి శ‌ర‌త్ కుమార్ చిరంజీవిని క‌లిసిన‌పుడు క్రాక్ మూవీలో జ‌య‌మ్మ‌గా త‌న న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడ్డ‌మే కాక‌.. అప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు ఫోన్ చేసి మాట్లాడిన‌ట్లు వ‌ర‌లక్ష్మి తెలిపింది. త‌న పాత్ర గురించి కూలంక‌షంగా వివ‌రిస్తూ, వివిధ స‌న్నివేశాల్లో హావ‌భావాల గురించి చిరు మాట్లాడటం చూసి తాను ఆశ్చ‌ర్యపోయాన‌ని.. ఇప్ప‌టిదాకా కెరీర్లో ఎన్నో ప్ర‌శంస‌లు అందుకున్న‌ప్ప‌టికీ.. చిరు నుంచి వ‌చ్చిన‌వి త‌న కెరీర్లోనే బెస్ట్ కాంప్లిమెంట్స్‌గా భావిస్తాన‌ని వ‌ర‌ల‌క్ష్మి అభిప్రాయ‌ప‌డింది.

తెలుగు ప్రేక్ష‌కులు త‌న‌ను ఇంత‌గా ఆద‌రిస్తార‌ని ఊహించ‌లేద‌న్న వ‌ర‌ల‌క్ష్మి.. ప్ర‌స్తుతం టాలీవుడ్లో మూడు సినిమాల్లో న‌టిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. అందులో సందీప్ కిష‌న్ సినిమా కూడా ఒక‌టుంద‌ని చెప్పింది. ఇప్ప‌టిదాకా తెలుగులో చేసినవి నెగెటివ్ క్యారెక్ట‌ర్లే అని.. అల్ల‌రి న‌రేష్‌తో చేసిన నాందిలో మాత్రం పాజిటివ్ క్యారెక్ట‌ర్ చేశాన‌ని.. సినిమాలో హీరో త‌ర్వాత త‌న‌దే ముఖ్య పాత్ర అని ఆమె చెప్పింది.