‘ఉప్పెన’ చిత్రానికి పట్టిన గ్రహణం ఇంకో మూడు రోజుల్లోనే వీడబోతోంది. గత ఏడాది ఏప్రిల్ 2న రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడటం.. లాక్ డౌన్ తర్వాత థియేటర్లు తెరుచుకున్నా మంచి టైమింగ్ కోసం ఎదురు చూడటం.. ఈ క్రమంలో పది నెలలకు పైగా కాలం గడిచిపోవడం తెలిసిందే. ఎట్టకేలకు వేలెంటైన్స్ డే వీకెండ్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. సినిమాకు అనుకున్న దాని కంటే మంచి హైపే వచ్చింది. కొత్త దర్శకుడితో కొత్త నటీనటులు చేసిన ఓ చిత్రానికి ఇలాంటి హైప్ రావడం ఆనందమే.. కానీ అంచనాలు మరీ ఎక్కువైపోతే వాటిని అందుకోవడమూ సవాలే.
కాగా ఈ సినిమాలో ఒక షాకింగ్ పాయింట్ ఉందని ముందు నుంచి చర్చ జరుగుతోంది. మొన్న ప్రి రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి సైతం ‘డేంజర్ పాయింట్’ అంటూ దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఆ డేంజర్ పాయింట్ గురించి ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లోనే కాదు.. సోషల్ మీడియాలో సైతం గట్టి ప్రచారమే జరుగుతోంది.
మొన్నటి దాకా సీక్రెట్‌లా ఉన్నది ఇప్పుడు అందరి చర్చల్లోకి వచ్చేసింది. తన కూతురిని ఒక పేదింటి కుర్రాడు ప్రేమించడం ఇష్టం లేని విలన్.. అతను సంసారానికి పనికి రాకుండా చేయడమే ఇందులోని షాకింగ్ పాయింట్. దీని గురించి కొంచెం పచ్చిగానే సినిమాలో చూపించారని తెలుస్తోంది. ఈ పాయింట్ జీర్ణించుకోవడానికి కొంచెం కష్టమే. ఒక కొత్త హీరోను డెబ్యూ సినిమాలో ఇలా చూపించడం షాకింగే. అందుకు ఒప్పుకున్న వైష్ణవ్ తేజ్‌కు, మెగా ఫ్యామిలీకి అభినందనలు చెప్పాల్సిందే.
ఐతే సినిమాలో ఈ పాయింట్ చూసి ప్రేక్షకులు షాకవడం ఖాయం. దీన్ని జీర్ణించుకోలేకపోతే సినిమా తేడా కొట్టొచ్చు కూడా. ఈ భయంతోనే చిత్ర బృందమే ఈ పాయింట్‌ను లీక్ చేసిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. దీని గురించి ఓ చర్చ జరిగి ముందే జనాలు ప్రిపేర్డ్‌గా ఉంటే తెరపై ఏం జరిగినా షాకవ్వరు. సస్పెన్స్‌లా దాచి ఉంచడం వల్ల ఏదైనా తేడా కొట్టినా కొట్టొచ్చని ముందే ప్రేక్షకులను ప్రిపేర్ చేశారేమో అనిపిస్తోంది. మరి సినిమాలో ఈ పాయింట్ పట్ల ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.