టాలీవుడ్ నేర్చుకోవాల్సిన ‘చిరు’ పాఠం


మెగాస్టార్ చిరంజీవి వేదికల మీదికెక్కి మైక్ అందుకున్నాడంటే చాలు.. ఒక పట్టాన పట్టాన ప్రసంగాలు ముగించట్లేదు ఈ మధ్య. ముఖ్యంగా ఏదైనా సినిమా వేడుకకు వచ్చారంటే చిరు సుదీర్ఘ ప్రసంగాలు చేసేస్తున్నారు. అలాగని ఆయన ప్రసంగాలేమీ బోర్ కొట్టట్లేదు. ఎంతో ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఆయన తన అనుభవాన్ని రంగరించి కొన్ని మంచి విషయాలు కూడా చెబుతున్నారు. ఇండస్ట్రీ జనాలను ఆలోచనలో పడేస్తున్నారు.

తాజాగా ‘ఉప్పెన’ ఆడియో వేడుకలోనూ చిరు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఆయన చెప్పిన ఈ విషయంపై టాలీవుడ్ సీరియస్‌గా దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ‘ఉప్పెన’ సినిమా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కడం గురించి ఆయన మాట్లాడారు. ఇలాంటి సినిమాలు తెలుగులో అరుదైపోతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఒకప్పుడు తమిళ దర్శకుడు భారతీ రాజా పల్లెటూరి నేపథ్యంలో రస్టిక్‌గా ఉండే లవ్ స్టోరీలు తీసేవారని.. అవి చాలా గొప్పగా ఉండేవని.. వాటిలో ఆత్మ ఉండేదని.. ఇప్పుడు తెలుగులో ఇలాంటి సినిమాలు కరువైపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘రంగస్థలం’ తర్వాత ‘ఉప్పెన’లో ఆ ఫ్లేవర్ కనిపించిందని.. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. మోడర్న్ సినిమా పేరుతో ఇప్పటి రచయితలు, దర్శకులు ఎంతసేపూ సిటీల చుట్టూనే తిరుగుతున్నారని, ఈ క్రమంలో మన మట్టి సినిమాలు మిస్ అయిపోతున్నామని చిరు అన్నారు.

ఆలోచించి చూస్తే చిరు చెప్పినది ఎంతో కీలకమైన విషయం అని అర్థమవుతోంది. ఒకప్పుడు తెలుగులో ఎక్కువగా పల్లెటూరి సినిమాలే వచ్చేవి. 80లు, 90ల్లోనూ ఆ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. వాటిలో మన నేటివిటీ కనిపించేది. తెలుగుదనం ఉట్టి పడేది. అవి మంచి విజయం సాధించాయి. కానీ 2000 తర్వాత మోడర్న్ సినిమాల పేరుతూ అందరూ సిటీల చుట్టూనే తిరగడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అవి మూసలా తయారయ్యాయి. పల్లెటూరి నేపథ్యంలో సినిమాలు అరుదైపోయాయి. కొన్నేళ్ల కిందట ‘రంగస్థలం’ సినిమా వస్తే అది కొత్తగా అనిపించడమే కాక, మన సినిమా అనే ఫీలింగ్ కలిగింది. ఈ నేపథ్యంలో చిరు చెప్పిన విషయాన్ని సీరియస్‌గా ఆలోచించిన మన రచయితలు, దర్శకులు గ్రామీణ నేపథ్యంలో మనవైన కథలతో సినిమాలు తీస్తే బెటర్.