తనపై మీమ్స్‌ను షేర్ చేసిన హీరోయిన్

తమపై సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్‌ను ఫిలిం సెలబ్రెటీలు చాలామంది పెద్దగా పట్టించుకోరు. కొంత మంది వీటికి అఫెండ్ అవుతారు కూడా. కానీ కొందరు మాత్రం వాటిని స్పోర్టివ్‌గా తీసుకుంటారు. ఎంజాయ్ చేస్తారు. వాటి మీద సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు కూడా. ప్రస్తుతం సౌత్‌ ఫిలిం ఇండస్ట్రీలో హ్యాపెనింగ్ బ్యూటీ అనదగ్గ మాళవిక మోహనన్ కూడా ఇదే బాటలో నడిచింది. ‘మాస్టర్’ సినిమా విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ భామ హావభావాలతో బోలెడన్ని మీమ్స్ తయారవుతున్నాయి.

‘మాస్టర్’ ఇంటర్వెల్ ముంగిట హీరో మీద మాళవిక తీవ్ర ఆక్రోశాన్ని చూపించే సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశంలో మాళవిక చక్కటి హావభావాలు పలికించింది. ఆ స్క్రీన్ షాట్లు తీసి మీమ్స్ మోత మోగిస్తున్నారు నెటిజన్లు. మాళవిక బ్రష్ చేస్తున్నట్లు, సెంటర్ ఫ్రెష్ నోట్లో వేసుకుని నములుతున్నట్లు, బీర్ తాగుతున్నట్లు, పాల ప్యాకెట్‌ను నోటితో కొరుకుతున్నట్లు ఇలా రకరకాల మీమ్స్ తయారయ్యాయి. ఇవి మాళవిక దృష్టికి వచ్చి ఆమె స్వయంగా తనపై వచ్చిన కొన్ని మీమ్స్ షేర్ చేసింది.

తాను కొంచెం ఆలస్యంగా ఈ మీమ్స్ చూశానని, అందులో తనకు నచ్చినవి షేర్ చేస్తున్నానని, ఇందులో ముఖ్యంగా తాను బ్రష్ చేస్తున్నట్లుగా ఉన్న మీమ్ చూసి పగలబడి నవ్వానని ఆమె చెప్పింది. మనల్ని చూసి మనం నవ్వుకోకుంటే జీవితం చాలా బోర్ కొట్టేస్తుందని కూడా ఆమె వ్యాఖ్యానించింది. మాళవిక తన మీమ్స్‌పై ఇంత స్పోర్టివ్‌గా స్పందించడం ఆమె ఫాలోవర్లను ఆకట్టుకుంది. ఆమె మీద వచ్చిన మరిన్ని మీమ్స్ తీసి కామెంట్ల రూపంలో పోస్ట్ చేస్తున్నారు. ‘మాస్టర్’కు భారీ విజయాన్నందుకున్న మాళవిక ప్రస్తుతం ధనుష్ సరసన కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది.