వామ్మో.. అప్పుడే సినిమా అయిపోయిందా?

సంక్రాంతి సందర్భంగా జనవరి 14న టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కొత్త సినిమా ‘పవర్ ప్లే’ గురించి అనౌన్స్‌మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ చివరి సినిమా ‘ఒరేయ్ బుజ్జిగా’ను రూపొందించిన విజయ్ కుమార్ కొండానే ఈ చిత్రానికి దర్శకుడు. వీళ్ల కలయికలో కొత్త సినిమా గురించి బయటికి వెల్లడైంది సంక్రాంతి సమయంలోనే. అంతకుముందే షూటింగ్ ఏమైనా మొదలుపెట్టారో ఏమో తెలియదు కానీ.. సినిమా గురించి ప్రకటన వచ్చిన మూడు వారాలకే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అంటూ పెద్ద షాక్ ఇచ్చాడు రాజ్ తరుణ్.

‘పవర్ ప్లే’ ట్రైలర్‌ను గురువారం ఉదయం 9.15 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ట్విట్టర్లో రాజ్ తరుణ్ పెట్టిన పోస్టర్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సినిమా ఎప్పుడు మొదలుపెట్టారు, ఎప్పుడు పూర్తి చేశారో తెలియక అయోమయానికి గురవుతున్నారు.

‘పవర్ ప్లే’ కంటే ముందు విజయ్ కుమార్ కన్నడలో ‘రైడర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తీస్తూనే ‘పవర్ ప్లే’ను మొదలుపెట్టాడు. ఐతే పక్కా స్క్రిప్టుతో రంగంలోకి దిగాడో ఏమో.. శరవేగంగా సినిమాను పూర్తి చేసి ఇంతలోనే ట్రైలర్ అంటున్నారు. ‘ఒరేయ్ బుజ్జిగా’లో కామెడీ ట్రై చేసిన రాజ్, విజయ్.. ఈసారి తమ శైలికి భిన్నంగా థ్రిల్లర్ సినిమా చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ థీమ్ చూస్తే ఇది డార్క్ థ్రిల్లర్ అనిపిస్తోంది. సినిమాలో బోలెడంత వయొలెన్స్ కూడా ఉండేలా కనిపిస్తోంది.

వనమాలి క్రియేషన్స్ అనే బేనర్ మీద దివేష్, మహిధర్ అనే కొత్త నిర్మాతలు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. తక్కువ బడ్జెట్లో, పరిమితమైన కాస్ట్ అండ్ క్రూతో సినిమాను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్‌ బ్రేక్ తర్వాత టాలీవుడ్లో చాలా సినిమాలను ఇలాగే ప్లాన్ చేస్తున్నారు. తక్కువ రోజుల్లో సినిమాలు పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా ఓటీటీలను టార్గెట్ చేస్తూ ఇలాంటి సినిమాలు తెరకెక్కుతున్నాయి. ‘పవర్ ప్లే’ కూడా ఆ బాటే పడుతుందేమో చూడాలి.