సినిమా రిలీజ్‌పై నిర్మాత‌ల‌తో హీరోకు గొడ‌వ‌?


త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ న‌టించిన జ‌గ‌మే తంత్రం సినిమాను థియేట‌ర్ల‌లో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేయ‌బోతున్నార‌ని, నెట్‌ఫ్లిక్స్ వాళ్ల‌తో డీల్ ఓకే అయిపోయింద‌ని, త్వ‌ర‌లోనే విడుద‌ల అని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇది ధ‌నుష్ అభిమానులకు ఎంత‌మాత్రం రుచించ‌డం లేదు. ఈ చిత్రాన్ని థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చేయాలంటూ వాళ్లు గొడ‌వ గొడ‌వ చేస్తున్నారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ రెండింట్లోనూ వారి ఆందోళ‌న కొన‌సాగుతోంది. ఐతే దీనిపై చిత్ర బృందం నుంచి ఎవ‌రూ ఏమీ మాట్లాడ‌ట్లేదు కొన్ని రోజులుగా.

ఓటీటీ రిలీజ్ ప్ర‌చారాన్ని ఖండించ‌ట్లేదంటే జ‌గ‌మేతంత్రం థియేట‌ర్ల‌లో రాద‌ని అంతా ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. అదే స‌మ‌యంలో ధ‌నుష్ న‌టించిన మ‌రో సినిమా క‌ర్ణ‌న్‌ను ఏప్రిల్లో థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు వ‌చ్చిన ప్ర‌క‌ట‌న అభిమానుల‌కు మ‌రింత ఆగ్ర‌హం తెప్పించింది. జ‌గ‌మే తంత్రంను మాత్రం ఎందుకు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నార‌న్న ప్ర‌శ్న‌లు మ‌రింత‌గా ఉత్ప‌న్న‌మ‌య్యాయి.


ఇలాంటి స‌మ‌యంలో ధ‌నుష్ ట్విట్ట‌ర్లోకి వ‌చ్చి జ‌గ‌మే తంత్రం గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు, త‌న శ్రేయోభిలాషులు, అభిమానుల్లాగే ఈ సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌ల కావాల‌ని తాను కూడా కోరుకుంటున్నాన‌ని, అంతా మంచే జ‌రుగుతుంద‌ని ఆశిద్దామ‌ని ఒక ట్వీట్ వేసి వెళ్లిపోయాడు. ఈ ట్వీట్ ఉద్దేశం ఏంటో చాలామందికి అర్థం కాలేదు.

ఐతే ధ‌నుష్ అభీష్టానికి వ్య‌తిరేకంగా నిర్మాత జ‌గ‌మే తంత్రం సినిమా ఓటీటీ రిలీజ్‌కు ఒప్పందం చేసుకున్నాడ‌ని, ఈ విష‌యంలో నిర్మాణ సంస్థ వైనాట్ స్టూడియోస్ అధినేత శ‌శికాంత్‌కు, ధ‌నుష్‌కు విభేదాలు నెల‌కొన్నాయ‌ని కోలీవుడ్లో ప్ర‌చారం సాగుతోంది. త‌న సినిమా ఓటీటీలో రిలీజ్ కావ‌డంలో త‌న త‌ప్పేమీ లేద‌ని, తాను కూడా థియేట‌ర్ల‌లో విడుద‌ల కావాల‌నే కోరుకుంటున్నాన‌ని అభిమానుల‌కు చెప్ప‌డం కోసం ధ‌నుష్ ఈ ట్వీట్ చేసిన‌ట్లుంది కానీ.. ఇది నిర్మాత‌ను ఇరికించేదే. ఈ నేప‌థ్యంలో సినిమా విడుద‌ల విష‌యంలో నిర్మాత నిర్ణ‌యం ఎలా ఉండ‌బోతుందో?