పెద్ద రిస్క్ చేస్తున్న మంచు విష్ణు

మంచు విష్ణు కెరీర్ ఏమాత్రం బాగా లేదు కొన్నేళ్లుగా. అతను చివరగా ఎప్పుడు హిట్టు కొట్టాడో కూడా జనాలకు గుర్తు లేదు. చివరగా అతడి నుంచి వచ్చిన ఆచారి అమెరికా యాత్ర, ఓటర్ సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి. దీంతో ఈసారి బాగా గ్యాప్ తీసుకుని ‘మోసగాళ్ళు’ అనే సినిమా చేశాడతను. ఇది తెలుగుతో పాటు ఇంగ్లిష్ భాషలో తెరకెక్కడం విశేషం. జెఫ్రీ లీ చిన్ అనే హాలీవుడ్ దర్శకుడు ఈ సినిమాను రూపొందించాడు. మంచు విష్ణు స్థాయికి మించి బడ్జెట్లో, భారీ కాస్టింగ్‌తో ఈ సినిమా తెరకెక్కింది.

కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి లాంటి పెద్ద తారలు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్లు చెబుతున్నారు. లాక్ డౌన్ టైంలో ఈ సినిమా అప్ డేట్లతో ఓటీటీ రిలీజ్ దిశగా సంకేతాలు ఇచ్చారు కానీ.. తర్వాత అలాంటిదేమీ లేకపోయింది.

మధ్యలో ఏ ప్రమోషన్లూ చేయని ‘మోసగాళ్ళు’ టీం సడెన్‌గా రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. మార్చి 11న మహాశివరాత్రి కానుగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారట. ఐతే ఆ పండక్కి ఆల్రెడీ మూడు సినిమాలు రేసులో ఉన్నాయి. శర్వానంద్ సినిమా ‘శ్రీకారం’తో పాటు శ్రీవిష్ణు మూవీ ‘గాలి సంపత్’.. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి నటించిన ‘జాతి రత్నాలు’ కూడా మార్చి 11నే రాబోతున్నాయి. ఇవి మూడూ ఆసక్తికర సినిమాలే. వాటికి మంచి బ్యాకప్ కూడా ఉంది. హిట్టు కొట్టి చాలా ఏళ్లయిన మంచు విష్ణు సోలో రిలీజ్ ఉండేలా చూసుకోవాల్సింది. లేదంటే పోటీ తక్కువున్న టైం ఎంచుకోవాల్సింది. కానీ అతను బాక్సాఫీస్ డల్లుగా ఉండే సీజన్లో మూడు చిత్రాలకు పోటీగా తన సినిమాను రేసులోకి దించుతున్నాడు.

మరి ఇంత పెద్ద రిస్క్ చేస్తున్న విష్ణుకు ఈసారి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి. ఇది విష్ణు సొంత సినిమా కావడం గమనార్హం. దీని తర్వాత అతను శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘డి అండ్ డి’ మూవీ చేయనున్నాడు.