సోలో ఛాన్స్ కొట్టేశాడుగా..


తెలుగులో నంబర్ వన్ మేల్ యాంకర్‌గా గుర్తింపు సంపాదించి, సినిమాల్లోనూ కొన్ని క్యారెక్టర్ రోల్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ ఈ సినిమా మొదలైనపుడు పెద్దగా ఆసక్తి లేదు కానీ.. ఈ చిత్రం నుంచి ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా’ పాట విడుదలయ్యాక కథ మారిపోయింది.

సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. స్టార్ హీరోల సినిమాల్లో పాటల్ని మించి ఇది పాపులారిటీ సంపాదించింది. సినిమాకు కూడా క్రేజ్ తీసుకొచ్చింది. ఈ ఊపులో గత ఏడాది మార్చిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవడానికి సిద్ధమయ్యారు. కానీ కరోనా వచ్చి అడ్డం పడింది. ఎంతకీ థియేటర్లు తెరుచుకోని పరిస్థితుల్లో కొంచెం పెద్ద సినిమాలు కూడా ఓటీటీ బాట పడుతుంటే ఈ చిన్న సినిమాను డిజిటల్ రిలీజ్ చేయకుండా ఎందుకు ఆపుతున్నారని చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు.

కానీ తాను హీరోగా పరిచయం అవుతన్న చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేయాలని పట్టుబట్టి ప్రదీప్ కూర్చున్నాడు. అతడికి దర్శక నిర్మాతలు సహకరించారు. అతడి నిరీక్షణ ఫలించి ఇప్పుడు మంచి టైమింగ్‌లో సోలోగా థియేటర్లలో రిలీజ్ చేసుకునే అవకాశం దక్కిందీ చిత్రానికి. ఈ నెల 29నే ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సంక్రాంతి సినిమాల్లో ‘క్రాక్’ మినహా అన్నీ జోరు తగ్గించేశాయి. ‘క్రాక్’ కూడా ప్రదీప్ సినిమా రిలీజయ్యే సమయానికి కొంచెం నెమ్మదిస్తుందని భావిస్తున్నారు. గత వారం విడుదలైన ‘బంగారు బుల్లోడు’ సోదిలో లేకుండా పోయింది. ఇలాంటి టైంలో ఏవో చిన్నా చితకా చిత్రాలు మినహాయిస్తే ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్రానికి పోటీయే లేదసలు. 29నే రావాలనుకున్న సుమంత్ సినిమా ‘కపటదారి’ని వాయిదా వేసేయడం దీనికి కలిసొచ్చింది. గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్లు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండటం విశేషం. ఇలా ప్రదీప్ సినిమాకు అన్నీ భలేగా కలిసొచ్చినట్లే ఉన్నాయి. ఐతే ఇవన్నీ పక్కన పెడితే సినిమాకు మంచి టాక్ రావడం ఇప్పుడు కీలకం. అది కూడా వస్తే ప్రదీప్‌కు మంచి లాంచింగ్ దొరికినట్లే.