ర‌జినీ సినిమా రిలీజ్ డేట్ వ‌చ్చేసింది


సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ అభిమానులు కొంత కాలంగా తీవ్ర నిరాశ‌లో ఉన్నారు. రాజ‌కీయ అరంగేట్రంపై ర‌జినీ యుట‌ర్న్ తీసుకోవ‌డమే అందుకు ముఖ్య కార‌ణం. త‌న వ‌య‌సు, అనారోగ్యం, క‌రోనా ప‌రిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆయ‌న ఆ తీవ్ర నిర్ణ‌యం తీసుకోక త‌ప్ప‌లేదు. మ‌రోవైపు ర‌జినీ న‌టిస్తున్న అన్నాత్తె సినిమా షూటింగ్ ఆగిపోవ‌డం, ఆ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ లేక‌పోవ‌డం కూడా అభిమానుల‌ను నిరాశ‌కు గురి చేస్తోంది.

ఐతే వారిలో మ‌ళ్లీ కొంత ఉత్సాహం తీసుకొచ్చే అప్‌డేట్‌ను అన్నాత్తె చిత్ర బృందం అందించింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించింది. దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌రు 4న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ర‌జినీ సినిమా అంటే తెలుగులోనూ బిగ్ రిలీజే ఉంటుంది కాబ‌ట్టి మ‌న వాళ్ల‌కూ ఇది ఆస‌క్తి రేకెత్తించే అప్‌డేటే.

టాలీవుడ్ మాత్ర‌మే కాదు.. కోలీవుడ్, బాలీవుడ్ సైతం ఈ ఏడాది అత్య‌ధిక అంచ‌నాల‌తో రానున్న‌ ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌ను బ‌ట్టి త‌మ సినిమాల రిలీజ్ ప్లాన్ చేసుకోవాల‌నుకున్నాయి. ఆ చిత్రం అక్టోబ‌రు 13న ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానున్న‌ట్లు తేల‌డంతో కొన్ని గంట‌ల్లోనే అన్నాత్తె రిలీజ్ డేట్ ప్ర‌క‌టించింది స‌న్ పిక్చ‌ర్స్. త‌మిళుల‌కు సంక్రాంతి త‌ర్వాత అత్యంత ప్రీతిపాత్ర‌మైన సీజ‌న్ అంటే దీపావ‌ళే. ప్ర‌తి ఏడాదీ ఆ సీజ‌న్లో భారీ చిత్రాలు వ‌స్తుంటాయి. కొన్నేళ్లుగా ఎక్కువ‌గా విజ‌య్ దీపావ‌ళికి త‌న సినిమాను దించుతున్నాడు. ఈ సారి ర‌జినీ ఆ పండ‌క్కి బెర్త్ బుక్ చేసేశాడు.

అజిత్‌తో వీరం, వేదాళం, విశ్వాసం లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్లు ఇచ్చిన శివ అన్నాత్తె చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. కీర్తి సురేష్‌, మీనా, ఖుష్బు ఇందులో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతం అందిస్తున్నాడు. మ‌రి కొన్ని రోజుల విరామం త‌ర్వాత ర‌జినీ ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన‌బోతున్నాడు.