అల్ట్రా డిజాస్టర్ దిశగా వంద కోట్ల సినిమా

ఈ దీపావళికి తెలుగులో పెద్ద సినిమాలేవీ రాలేదు కానీ.. హిందీ, తమిళ భాషల్లో మాత్రం క్రేజీ మూవీస్ రిలీజయ్యాయి. హిందీలో ‘రామాయణం’ లాంటి భారీ చిత్రం గురువారం రిలీజ్ కాగా.. తర్వాతి రోజు తమిళంలో సీన్, మూకుత్తి అమ్మన్-2 ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో రామాయణం, సీన్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి ఫలితం అందుకునే దిశగా సాగుతున్నాయి. కానీ ‘మూకుత్తి అమ్మన్-2’ మాత్రం దారుణమైన ఫలితాన్నందుకునేలా కనిపిస్తోంది.

ఈ సినిమాకు మేకర్స్ పేర్కొన్న బడ్జెట్ రూ.100 కోట్లు. ఈ భక్తి చిత్రంలో భారీగా విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అందుకే ఖర్చు భారీగానే అయి ఉంటుందని అంచనా. కానీ ఎంత ఖర్చు పెట్టి ఏం లాభం? దశాబ్దాల కిందట రావాల్సిన కథాకథనాలతో చాలా రొటీన్‌గా సినిమా తీశాడు సీనియర్ దర్శకుడు సుందర్.సి. ఈ చిత్రానికి తమిళంలో కూడా ఆశించిన బజ్ క్రియేట్ కాలేదు. ట్రైలర్ చూసినపుడే ఏదో తేడాగా ఉందే అనే ఫీలింగ్ కలిగింది. నయనతార, రెజీనా లాంటి స్టార్ కాస్ట్ ఉన్నా సరే.. సినిమాకు బజ్ రాలేదు.

తొలి రోజు ‘మూకుత్తి అమ్మన్-2’ కేవలం రూ.3 కోట్ల కలెక్షన్ మాత్రమే రాబట్టింది. రామాయణం, సీన్ సినిమాల దెబ్బ.. నయన్‌కు గట్టిగానే తగిలిందన్నది స్పష్టం. తమిళంలోనే ఈ చిత్రానికి ఆక్యుపెన్సీలు అంతంతమాత్రంగా ఉండగా.. తెలుగు ప్రేక్షకులు దీన్ని అస్సలు పట్టించుకోలేదు. ‘మహాశక్తి’ పేరుతో తెలుగు వెర్షన్ రిలీజ్ చేయగా.. ఇక్కడ తొలి రోజు రిలీజ్ ఖర్చులకు సరిపడా కలెక్షన్లు కూడా వచ్చినట్లు లేవు. 

నయన్ స్టార్ పవర్ కూడా ‘మూకుత్తి అమ్మన్-2’ను కాపాడేలా కనిపించడం లేదు. అసలే పాజిటివ్ టాక్ లేదు. ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఇక సినిమా ఎలా నిలబడుతుంది? ఇలాంటి కంటెంట్‌ను నమ్మి నిర్మాతలు వంద కోట్ల ఖర్చు ఎలా పెట్టారన్నది అర్థం కాని విషయం. కమల్ నిర్మాణంలో రజినీకాంత్ హీరోగా సినిమా చేసే అవకాశం వస్తే.. అది వద్దనుకుని సుందర్ తీసిన చిత్రమిది. ‘మూకుత్తి అమ్మన్’ తీసిన ఆర్జే బాలాజీ మంచి ఫలితమే రాబట్టాడు. కానీ అతను తర్వాత ‘కరుప్పు’లో బిజీ అయిపోగా.. సీక్వెల్ బాధ్యతలను సుందర్ తీసుకున్నాడు. కానీ అదెంత రాంగ్ డెసిషనో ఇప్పుడు బాక్సాఫీస్ ఫలితం చూస్తే అర్థమవుతోంది.