త్రివిక్రమ్ కే మైండ్ బ్లాక్ అవుతోందట!

హీరోలు, హీరోయిన్ల గురించి పుకార్లు సర్వ సాధారణమే కానీ ఒక డైరెక్టర్ ని పదేపదే గాసిప్స్ వెంటాడవు. కానీ ఏ సూపర్ స్టార్ మీదా రానన్ని పుకార్లు త్రివిక్రమ్ గురించి వస్తున్నాయి. అల వైకుంఠపురములో పెద్ద హిట్ అవడం, తదుపరి చిత్రం ఎన్టీఆర్ తో చేస్తుండడంతో త్రివిక్రమ్ ఇప్పుడు ఒక ట్రెండింగ్ టాపిక్. పైగా లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ లేక ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండట్లేదో ఏమో.. ఇక యథేచ్ఛగా గాసిప్ వార్తలు వండి వడ్డించేస్తున్నారు.

ఇందులో తన గురించి ఎక్కువ వస్తుండడం గురూజీ త్రివిక్రమ్ కి షాకింగ్ గా ఉందట. ఆయన మాములుగా వెబ్ సైట్స్ అవీ చూడడట. అయితే లాక్ డౌన్ వేళ తన గురించి వచ్చిన పుకార్లని గురించి తెలిసిన వాళ్ళు వాకబు చేస్తూ వుంటే త్రివిక్రమ్ కే మైండ్ బ్లాక్ అవుతోందట.

ఇన్ని స్టోరీలు తానే ఇంతవరకు రాయలేదని, అసలు సినిమాలు ఎప్పుడు మళ్ళీ దారిలో పడతాయో తెలియక అయోమయంగా వుంటే వాళ్ళతో చేస్తున్నారు, వీళ్ళతో చేస్తున్నారు అంటూ ఈ ప్రచారం ఏమిటని ఆయన తల పట్టుకుంటున్నాడట. వెంకటేష్ తో ఆయన సినిమా ఉంటుందని వచ్చిన వార్తలో కూడా నిజం లేదు. ఆయన తదుపరి చిత్రం ఎన్టీఆర్ తో ఫిక్స్ అయింది. ఎంత లేట్ అయినా కానీ త్రివిక్రమ్ మలి చిత్రం మాత్రం అదే ఉంటుంది.