ఇండియాలో ఈ ఏడాదికి మోస్ట్ అవైటెడ్ సినిమా అంటే ‘ఆర్ఆర్ఆర్’యే అనడంలో మరో మాట లేదు. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ముందు అనుకున్న ప్రకారం అయితే ఈపాటికే సినిమా విడుదల కావాల్సింది. ఐతే ఒకసారి షూటింగ్ ఆలస్యం వల్ల సినిమాను వాయిదా వేస్తే.. కరోనా దెబ్బకు ఆ ప్రణాళిక కూడా దెబ్బ తింది. ఆరు నెలలకు పైగా చిత్ర బృందం పని ఆపి కూర్చోవాల్సి వచ్చింది. గత అక్టోబరులో షూటింగ్ పున:ప్రారంభించి విరామం లేకుండా చిత్రీకరణ సాగిస్తున్నారు.
ఐతే ఎంత పక్కాగా ప్లాన్ చేసుకున్నప్పటికీ రాజమౌళి సినిమా అంటే మళ్లీ మళ్లీ ప్రణాళికలు మారడం, రిలీజ్ వాయిదా పడటం మామూలే. అందులోనూ రామ్ చరణ్‌కు కొంత విరామం ఇచ్చి ‘ఆచార్య’ కోసం పంపించిన నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ మరింత ఆలస్యం కాబోతోందని.. 2021లో ఈ సినిమా విడుదల కాకపోవచ్చని.. 2022 సంక్రాంతికి సినిమాను ఆశించవచ్చని ఒక ప్రచారం నడుస్తోంది ఇండస్ట్రీలో.
ఐతే కరోనా విరామం తర్వాత రాజమౌళి మునుపటితో పోలిస్తే వేగం అందుకున్నాడని.. తక్కువ సమయంలో ఎక్కువ సన్నివేశాలు పూర్తి చేశాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళికి సినిమా ఏ తీరులో నడుస్తుందో.. అదే తరహాలో షూటింగ్ చేయడం అలవాటు. చాలా వరకు కథలో సీనిక్ ఆర్డర్ ఎలా ఉంటుందో అలాగే సన్నివేశాల చిత్రీకరణా సాగుతుందట. ‘ఆర్ఆర్ఆర్’ విషయంలోనూ ఆ పద్ధతినే ఫాలో కాగా.. సినిమాలో కొన్ని చిన్న సన్నివేశాలు మినహాయిస్తే క్లైమాక్స్ ముందు వరకు పూర్తయిందని.. ఇక మిగిలింది పతాక ఘట్టమే అని అంటున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ చిత్రీకరణ మొదలుపెడుతున్న విషయాన్ని జక్కన్న అధికారికంగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని కోసం చిత్ర బృందమంతా తమ ఎనర్జీని దాచుకుందని.. ఇక విరామం లేకుండా ఈ సన్నివేశాల చిత్రీకరణ సాగనుందని.. అటు ఇటుగా రెండు నెలల్లో టాకీ పార్ట్ మొత్తం అయిపోవచ్చని అంటున్నారు. ఆ తర్వాత ఆరు నెలలు పోస్ట్ ప్రొడక్షన్‌కు వేసుకున్నా.. దసరా సమయానికి ‘ఆర్ఆర్ఆర్’ను థియేటర్లలో చూసే అవకాశం ఉన్నట్లే. కాబట్టి 2021లోనే ఆర్ఆర్ఆర్ వస్తుందని ఆశలు పెట్టుకోవచ్చన్నమాట.