ఓటీటీ రిలీజ్‌లపై అగ్ర నిర్మాత కౌంటర్లు


కరోనా-లాక్ డౌన్ కారణంగా థియేటర్లు నెలల తరబడి మూత పడి ఉండటంతో ఇక తప్పదన్నట్లుగా చిన్న, పెద్ద తేడా లేకుండా కొన్ని సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. కానీ కొన్ని చిత్రాల నిర్మాతలు మాత్రం ఓటీటీ ఆఫర్లు ఎన్ని వచ్చినా తిరస్కరించారు. థియేటర్లలోనే తమ చిత్రాలను విడుదల చేయాలని పట్టుబట్టి కూర్చున్నారు. అందులో సీనియర్ నిర్మాత స్రవంతి రవికిషోర్ ఒకరు.

రామ్ హీరోగా ఆయన నిర్మించిన ‘రెడ్’ గత ఏడాది ఏప్రిల్లోనే రావాల్సింది. ఫస్ట్ కాపీ కూడా రెడీ చేశాక లాక్ డౌన్ వల్ల వాయిదా పడింది. మధ్యలో ఈ సినిమాకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ నుంచి మంచి ఆఫర్లే వచ్చినా రవికిషోర్ తలొగ్గలేదు. ఎట్టకేలకు కొత్త ఏడాదిలో సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. టాక్ కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితమే దక్కింది.

ఓటీటీల నుంచి ఆఫర్లు వచ్చినా ఎందుకు తలొగ్గలేదు, కరోనా పరిస్థితుల నేపథ్యంలో మిగతా నిర్మాతల్లా ఎందుకు ఓటీటీ బాట పట్టలేదు అని ఓ ఇంటర్వ్యూలో రవికిషోర్‌ను అడిగితే.. ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఎంత కాలం అయినా ఆగి తమ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని అనుకున్నానని.. థియేటర్ కోసం చేసిన సినిమాను ఓటీటీకి ఇవ్వడం కరెక్ట్ కాదన్నది తన అభిప్రాయమని రవికిషోర్ చెప్పారు.

‘‘10 రూపాయలు పెట్టుబడి పెడితే 12 రూపాయలు వస్తే చాలు అనుకునే వాళ్లు ఉన్నారు. పది రూపాయలు 9 రూపాయలు వచ్చినా, 12 రూపాయలు వచ్చినా ప్రేక్షకుడి నుంచే నేరుగా రావాలని నేను ఆలోచిస్తా. ఇలాంటి నిర్మాతలం కొంతమంది ఉన్నాం. సినిమా అంటే ప్యాషన్ అని చెప్పినవాళ్లు థియేటర్లలో కాకుండా ఓటీటీలో సినిమాను విడుదల చేస్తే వాళ్ల మాటలను నమ్మవద్దు’’ అంటూ ఓటీటీలకు వెళ్లిన నిర్మాతలపై గట్టి కౌంటరే వేశారు రవికిషోర్. కరోనా పరిస్థితుల నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా బాగుపడాలనే ఉద్దేశంతో ‘రెడ్’ ముందు అనుకున్న దాని కంటే తక్కువ రేట్లకే అమ్మామని.. ఈ సినిమాను కొన్న అందరూ 4 రోజుల్లోపే బ్రేక్ ఈవెన్‌కు వచ్చారని రవికిషోర్ తెలిపారు.