కోలీవుడ్ వివాదాల వీరుడు శింబు మళ్లీ చిక్కుల్లో పడ్డాడు. అతను నటించిన ‘అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్’ (ఏఏఏ) తాలూకు వివాదం అతణ్ని ఒక పట్టాన వదలట్లేదు. మూడేళ్లుగా అతను ఈ సినిమా తాలూకు వివాదంలో పడి కొట్టు మిట్టాడుతున్నాడు. ఇప్పుడు ఆ వివాదం కారణంగా తమిళ నిర్మాతల మండలి శింబును వెలివేసే పరిస్థితి వచ్చింది.
ఇంతకీ విషయం ఏంటంటే..శింబు హీరోగా మైఖేల్ రాయప్పన్ అనే నిర్మాత నాలుగేళ్ల కిందట ‘అన్బానవన్ – అరసాదవన్ – అడంగాదవన్’ అనే చిత్రాన్ని మొదలుపెట్టాడు. ఐతే ఈ చిత్రానికి మధ్యలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అతి కష్టం మీద విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఐతే ఈ సినిమా విషయంలో శింబు అసలు ఏమాత్రం సహకరించలేదని, అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశాడని నిర్మాత ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర ఆరోపణలు చేశాడు గతంలో. దర్శకుడు సైతం ఆయనకే మద్దతుగా నిలిచాడు.
ఈ విషయమై తమిళ నిర్మాతల మండలి జోక్యం చేసుకుని రాయప్పన్, శింబు మధ్య రాజీ కుదిర్చింది. రాయప్పన్‌కు ఒక సినిమాను ఉచితంగా చేయడం లేదంటే.. ఆయనకు రూ.6.6 కోట్ల మొత్తాన్ని మూడు విడతలుగా చెల్లించేలా ఇద్దరికి ఒప్పందం కుదిరింది. ఐతే శింబు రాయప్పన్‌కు ఉచితంగా సినిమానూ చేయలేదు. డబ్బులూ ఇవ్వలేదు.
ఈ విషయమై మైఖేల్ రాయప్పన్ తిరిగి నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. దీనిపై సీరియస్ అయిన నిర్మాతల మండలి శనివారం అత్యవసరంగా సమావేశమై… శింబు భవిష్యత్తులో నటించే చిత్రాలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించరాదని తీర్మానించింది. మరి ఈ తీర్మానంపై శింబు ఎలా స్పందిస్తాడో.. అతను హీరోగా నిర్మాణంలో ఉన్న సినిమాల పరిస్థితేంటో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates